ఉభయ సభల నిరవధిక వాయిదా

3

– కీలకబిల్లులకు లభించని ఆమోదం

– విపక్షాల వాకౌట్‌

– పార్లమెంట్‌ ముందు ధర్నా

న్యూఢిల్లీ,ఆగస్ట్‌13(జనంసాక్షి):

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాకౌట్‌తో విపక్షాలు సమావేశాలకు ముగింపు పలికాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొనాలని, సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసినా,ఎలాంటి చర్చచేయకుండా ముగించడం విశేషం. అలాగే ఎలాంటి కీలక బిల్లుల ఆమోదం పొందకుండానే ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి చివరి రోజు వరకు లలిత్‌మోదీ, వ్యాపమ్‌ స్కామ్‌లపై విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి. బుధవారం లలిత్‌ మోదీకి సుష్మా స్వరాజ్‌ సాయంపై వాడీవేడీ చర్చ సాగింది. చివరిరోజు సమావేశాల్లో విపక్షాలు తమ పట్టును వీడలేదు. లలిత్‌మోదీ వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్‌ చేశాయి. స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపాయి. విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ సహా తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎస్పీ, వామపక్షాలు వాకౌట్‌ చేశాయి. తర్వాత సభలో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ముగిసనట్టు, సభ నిరవధికంగా వాయిదా పడినట్లు స్పీకర్‌ ప్రకటించారు. వాయిదాకు ముందు స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ మాట్లాడుతూ లోక్‌సభలో విపక్షాల నిరసనలు విచారకరమన్నారు. విపక్షాల ఆందోళనలతో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునవృత్తం కావని ఆశిస్తున్నానని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలలో లోక్‌ సభలో 34 గంటల సమయం వృదా అయిందని లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ చెప్పారు. పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా ఆమె ప్రకటన చేశారు. తాను పార్లమెంటులో అనుసరించవలసిన పద్దతులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించానని ఆమె చెప్పారు. ప్లకార్డుల ప్రదర్శన వద్దని అనుకున్నామని,కాని కొందరు సభ్యులు ప్లకార్డులతో సభకు ఆటంక పరచారని,దాంతో వారిని సస్పెండ్‌ చేయవలసి వచ్చిందని ఆమె చెప్పారు. భవిష్యత్తు సమావేశాలలో అయినా ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.  జాతీయగీతాలాపన అనంతరం సభ నిరవధికంగా వాయిదా

పడింది. ఇటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరిరోజు సభ మొదలవగానే లలిత్‌గేట్‌పై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో చైర్మన్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎంసీ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.