ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగింది.. జాతీయ సమైక్యతా దినోత్సవంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: నిరుపేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నదే బీఆర్‌ఎస్‌  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నామన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. లబ్ధిదారులను పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నామని, మహిళల పేరిట ఇండ్లను అందిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎందుకంటే ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదని స్పష్టం చేశారు.సొంతంగా స్థలంఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం ‘గృహలక్ష్మి’ పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో రూ.3 లక్షలు ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తొలిదఫాలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.ఆసరా పెన్షన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయమని సీఎ అన్నారు. అందుకే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాశిలోనూ, వాసిలోనూ పెన్షన్లు పెంచిందని చెప్పారు. గతంలో కేవలం రూ.200గా ఉన్న పింఛన్‌ మొత్తాన్ని రూ.2,016కు పెంచుకున్నామని తెలిపారు. దివ్యాంగులుకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఇటీవలే రూ.3016 నుంచి రూ.4016కు పెంచుకున్నామని చెప్పారు. 2014 నాటికి పెన్షన్ తీసుకునేవారి సంఖ్య 29 లక్షలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 44 లక్షకు పెరిగిందని వెల్లడించారు. వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులతోపాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పింఛన్‌ సౌకర్యం కల్పించిందన్నారు. లబ్ధిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించామని గుర్తుచేశారు.

ఆర్థికంగా వెనుకబాటుతనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించిందని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్ని వర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉందని, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాలలో కొంతమేరకు మేలు జరిగినా, ఆ తర్వాత ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకు సాగలేదని వెల్లడించారు. దాంతో దళితుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయని చెప్పారు.

దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం ‘తెలంగాణ దళిత బంధు’ అని వెల్లడించారు. దళిత కుటుంబం తమకు వచ్చిన, నచ్చిన వృత్తి కానీ, వ్యాపారం కానీ చేపట్టడానికి వీలుగా ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ఇది ఒక నూతన చరిత్ర అని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం కాగడా వేసి వెదికినా కనపడదన్నారు. దళితులు వ్యాపార రంగంలోకూడా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకొనే లాభదాయక వ్యాపారాల్లో వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెల్యూల్డ్‌ తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని అమలు పరుచుకుంటున్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి వారి అభివృద్ధికి నిధులు కేటాయించుకుంటున్నామని చెప్పారు.బలహీన వర్గాలలోని వృత్తిపనుల వారికి, మైనారిటీ వర్గాలకు కుటుంబానికి రూ.లక్ష వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి, గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని వెల్లడించారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నవారికి గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపల పెంపకం, నేత కార్మికులకు సబ్సిడీపై నూలు, రంగుల సరఫరా, వారికి పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమా, మద్యం దుకాణాలలో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్, ఈత, తాటి చెట్లపై పన్నురద్దు, రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు కూడా విద్యుత్ రాయితీ, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నదని చెప్పారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ రాష్ట్ర ప్రభుత్వం అడవి బిడ్డలకు తీపి కబురు అందించిందని వెల్లడించారు. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, పోడు భూములకు పట్టాలందించిందన్నారు. గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కుమ్రం భీమ్ పేరుతో ఏర్పాటైన అసిఫాబాద్ జిల్లా నుంచే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టిందన్నారు. ఆదివాసీ, గిరిజనులకు ఇచ్చిన పోడు భూములకు రైతుబంధు కూడా అందజేస్తున్నదని చెప్పారు. పోడు భూముల కోసం జరిపిన పోరాటంలో అమాయక గిరిజనులపై ఉన్న కేసులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.