ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు
పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు
వాగు దాటబోయి గల్లంతయిన వ్యక్తి మృతి
పలు చోట్ల ఇళ్లలోకి చేరిన వాననీరు
కర్నూలు,అగస్టు2(జనంసాక్షి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాలలో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతిలో వాగుదాటుతూ ఒ వ్యక్తి చనిపోయాడు. జూపాడు బంగ్లా మండలంలో శుద్ధ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో వాగు ఉధృతంగా పారుతోంది. వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. గడివేముల మండలం గని గ్రామంలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఓర్వకల్లు మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. కర్నూలు నగరంలో అర్థ రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని శ్రీరామ్ నగర్ లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదోని మండలం లోనూ భారీ వర్షం కురిసింది. పెద్దఎత్తున వరద నీరు రావడంతో చాలా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి సామగ్రి మొత్తం తడిచిపోయింది. బలదురులో గర్జివంక పొంగిపొర్లుతోంది. వరద నీటికి పంటపొలాలు మొత్తం నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి కురిసిన వర్షాలకు కర్నూలులోని నెరవాడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటేందుకు వెళ్తున్న ఐదుగురిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జూపాడు బంగ్లా మండలం, పారుమంచాయిలో
ఇసుకవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ ఆవరణ జలమయమైంది. దీంతో పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందికొట్కూరు, మారాతీనగర్‌లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రాహ్మణకొట్కూరులో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వందల ఎకరాలలో పంట నీటమునిగింది. కల్లూరు మండలంలో నెలవాడ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నెరవాడ గ్రామానికి చెందిన మద్దిలేటి అనే వ్యక్తి మరో నలుగురు కలిసి వాగు దాటి కర్నూలుకు వెళ్లే ప్రయత్నం చేశారు. మధ్యలోకి వచ్చేసరికి మద్దిలేటి అనే వ్యక్తి బ్యాలెన్స్ తప్పి నీళ్లలో పడిపోయాడు. అయితే మిగిలిన నలుగురు అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన వాగులో కొట్టుకుపోయాడు. కిలోవిూటరు దూరంలో మద్దిలేటి శవమై తేలాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.