ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక
టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు
జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్
జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి
వరంగల్,సెప్టెంబర్19(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల అభ్యర్థులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార రంగంలో దిగారు. మహాకూటమి అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. బిజెపి మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తరవాతనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపింది. జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఇక్కడ మహాకూటమి నుంచి పోటీ ఉన్నా ఆయనే అభ్యర్తఙగా ఉండనున్నారు. మాజీ ఎమ్మలె/-యే సిహెచ్ రాజిరెడ్డి సిపిఐ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నా, మహాకూటమి కారణంగా ఆయనకు టిక్కెట్ దక్కేలా లేదు. అలాగే టిఆర్‌ఎస్ టిక్కెట్ కోసం తెరవెనక ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. తిరిగి ముత్తిరెడ్డికే టిక్కెట్ కేటాయించడంతో ఆయన పోటీకి దూరంగా ఉండాల్సిందే. టిఆర్‌ఎస్‌పై ఆశలతో ఆయన బిజెపి నుంచి బయటకు వచ్చారు. భూపాలపల్లి నుంచి మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మల్లీ పోటీ చేయనున్నారు. అలాగే స్టేషన్ ఘనాపూర్ నుంచి మాజీ ఎమ్మల్యే విజయరామారావు ఉన్నారు. నర్సంపేటలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. మహాకూటమి కారణంగా ఇక్కడ టిక్కెట్ రేసులో ఉన్న టిడిపి సీనియర్ రేవూరి ప్రకాశ్ రెడ్డికి స్థానం లేకుండ ఆపోయింది. ఇక బిజెపి కూడా టిక్కెట్లను ఆచితూచి గెలుపువీరులకు ఇవ్వాలని చూస్తోంది. ఒంటరి పోరుకే సిద్ధమైన బిజెపి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే బూత్‌లెవల్ కమిటీల నియామకాలతోపాటు అనుబంధ సంఘాలతో పార్టీని బలోపేతం చేసేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల నుంచి దాదాపు అభ్యర్థులు ఖరారైనప్పటికీ ములుగు సీటుపైనే ఉత్కంఠ నెలకొంది. వలస నేతలకు ఇక్కడి నుంచి అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి, మంథని, ములుగు నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను
బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉజ్వలయోజన పథకం పేరుతో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ నాయకులు మహిళలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్పు కోసం బీజేపీ అనే పేరుతో జిల్లాలో పలుచోట్ల యాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నమో యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను చేరవేస్తున్నారు. భూపాలపల్లి నుంచి మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు చందుపట్ల కీర్తిరెడ్డి అరంగేట్రం చేస్తున్నట్లు సమాచారం. ఇక మంథని నుంచి రామగిరికి చెందిన రెండ్ల సనత్‌కుమార్ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో కీలకనేతగా పనిచేస్తున్న పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. గతంలో ఆయనకు ఏబీవీపీలోనూ, ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉండటంతో ఈ సారి మంథని నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ములుగు నియోజకవర్గంలోనూ పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ వలస నేతలపైనే ఆ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భూక్యా రాజునాయక్‌తోపాటు పలువురు నాయకులు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో అసమ్మతి తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాషాయపార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా భూపాలపల్లి స్థానం బీజేపీకి కేటాయించారు. అప్పుడు టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీ చేశారు. ఆ సమయంలో 50వేలకు పైచిలుకు ఓట్లు బీజేపీ అభ్యర్థికి పోలయ్యాయి. ఇక్కడ మళ్లీ ఎవరు నిలబడతార్నది చూడాలి. అన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న వారి జాబితాను సిద్దం చేశారు.