ఉమ్మడి జిల్లాలో జోరు పెంచిన టిఆర్‌ఎస్‌


ఊరూవాడా జోరుగా ప్రచారం
అభివృద్దిని చూసి ఓటేయాలని పిలుపు
ఖమ్మం,నవబంర్‌28(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఎక్కడా అలసత్వం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా ఎవరిని వదలకుండా కలసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేయించామని  టీఆర్‌ఎస్‌ ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు పట్టణంలో నివేశన స్థలాలపై హక్కులు కల్పించామని గుర్తుచేశారు. అభివృద్ధిని సంపూర్ణం చేసేకునేందుకు మరోసారి తనను గెలపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల అపవిత్రి పొత్తులతో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌ నాయకులు జనం ముందుకు వస్తున్నారని, ఓటు ద్వారా వారికి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా వెనుకబాటులో మగ్గుతున్న ఇల్లెందును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించారు.  అందరినీ పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ప్రతి వార్డులోనూ సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించామన్నారు. పట్టణాభివృద్ధికి గతంలో ఎన్నడూలేనంతగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం టెండర్ల దశలోనే వందల కోట్ల నిధులు ఉన్నాయని, ఎన్నికలు పూర్తికాగానే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి పట్టణాన్ని సుందరీకరిస్తామని చెప్పారు.  అభివృద్దిని గుర్తించి  ఆలోచించి ఓటు వేయాలని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి జలగం వెంకటరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలనూ సమ దృష్టితో చూస్తోందని, అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు పాటుపడుతున్నానని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తాను తీసుకున్న చర్యల గురించి వివరించారు. మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో కొత్తగూడెం నియోజకవర్గ రూపురేఖలను మారుస్తానని మాట ఇచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధి జరగాయంటే అది ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనేనని, ప్రతీ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ స్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పినపాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు కోరారు. మాహాకూటమి మాయమాటలతో ఓట్లు అడిగేందుకు వస్తోందని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. 60 ఏళ్ల పాలనలో ఏజెన్సీ గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ప్రజల మంచి కోరే మన కేసీఆర్‌ ఆసరా పింఛన్‌, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, కల్యణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కేసీఆర్‌ కిట్‌, రైతు బీమా, రైతుబంధు వంటి అద్భుతమైన పథకాలు అందించారన్నారు. మండలంలో రోడ్ల నిర్మాణానికి ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఎంజీఎస్‌వై కింద రూ.300 కోట్లకు పైబడి రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు మంజూరి చేశామన్నారు.  రైతులకు పోడు
భూములకు పట్టాలు ఇప్పించి వాటికి రైతుబంధు వర్తింపజేసి, రైతుబంధులో పంట పెట్టుబడి కింద ఎకరానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.