ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. కొంతకాలంగా దోబూచు

లాడుతున్న మేఘాలు ఎట్టకేలకు వర్షించడంతో కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగాయి. చెరువులు, వాగులు, వంకలు నీటితో పొంగి పొర్లాయి. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోనే బజార్‌హత్నూర్‌ మండలంలో అత్యంత ఎక్కువగా 49సెంటివిూటర్ల వర్షపాతం నమోదైంది. బజార్‌హత్నూర్‌ చెరువు నిండటంతో ఆ ప్రాజెక్టు నుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంటలకు అనుకూలంగా వర్షాలు కురియ డంతో ఈ ఏడు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ పట్టణానికి సవిూపంలో ఉన్న బంగారుగూడ వాగు పొంగిపొర్లింది. జైనథ్‌, బేల, నిపాని, సాంగ్వీ వాగులు సైతం పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పెరిగాయి. సాత్నాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెరిగింది. మత్తడి వాగు ప్రాజెక్టు నీటి కూడా పెరిగింది. సరైన సమయంలో వర్షం పడడంతో పంటలకు జీవం పోసినట్లయిందని ఓ వైపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా, తాజా ఇన్‌ఫ్లోతో వరదగేటు ద్వారా గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఏడో నంబర్‌ గేటును ఎత్తి నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లొ వెళ్తోంది. ఇప్పటికే లక్షేట్టిపేట మండలం గూడెం వద్ద పాత వంతెన మునిగిపోయింది. ఇన్‌ఫ్లో ఆధారంగా దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తామని ఆయకట్టు అధికారులు తెలిపారు.