ఉరి శిక్షలకన్న క్షమాబిక్షలే ఎక్కువ

1w

లా కమిషన్‌ వెల్లడి

న్యూఢిల్లీ సెప్టెంబర్‌1(జనంసాక్షి):

భారత న్యాయవ్యవస్థలోని శిక్షల్లో ఉరిశిక్ష అతి పెద్దది. ఎంతో క్లిష్ట మైన పరిస్థితుల్లో తప్ప ఏ వ్యక్తికీ ఉరిశిక్ష వేయరాదని రాజ్యాంగం చెపుతోంది. ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే.. కోర్టుల దశ దాటేసిన తర్వాత అతనికి ఉండే ఆఖరి అవకాశం రాష్ట్రపతి క్షమాభిక్ష. ఎన్నో సందర్భాల్లో ఉరిశిక్ష పడ్డ నిందితులకు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతుంటారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి అంగీకరించిన క్షమాభిక్ష పిటిషన్లపై లా కమిషన్‌ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు మన దేశంలో 437 మంది ఉరిశిక్ష పడ్డ నిందితులు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఇందులో 306 మంది పిటిషన్లను ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతులు     ఆమోదించి వారి పడ్డ శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష మార్చారు. 131 మంది పిటిషన్లను మాత్రం కొట్టివేశారు. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ అత్యధిక పిటిషన్లను అంగీకరించారు. ఆయన పదవీకాలంలో 181 క్షమాభిక్ష పిటిషన్లు అందుకోగా, అందులో 180 మందికి క్షమాభిక్ష పెట్టగా, కేవలం ఒకరి పిటిషన్‌ను మాత్రమే ఆయన తిరస్కరించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పదవీకాలంలో 57 క్షమాభిక్ష పిటిషన్లు రాగా, అన్నింటినీ ఆయన అంగీకరించారు. మాజీ రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ తనకు వచ్చిన 50 క్షమాభిక్ష పిటిషన్లలో 45 మంది పిటిషన్లను కొట్టివేశారు. జైల్‌సింగ్‌ రాష్ట్రపతిగా ఉండగా 32 పిటిషన్లకు గానూ, 30 పిటిషన్లను తిరస్కరించారు. మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ తనకు వచ్చిన 18 క్షమాభిక్ష పిటిషన్లను కొట్టివేశారు. 1950-82 కాలంలో బాబూ రాజేంద్రప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సహా ఆరుగురు రాష్ట్రపతులు పనిచేశారు. ఈ సమయంలో 263 పిటిషన్లు రాగా, 262 పిటిషన్లును అంగీకరించారు. 1997-2007 కాలంలో పనిచేసిన ఇద్దరు రాష్ట్రపతులు తమకు వచ్చిన క్షమాభిక్ష పిటిషన్లలో చాలా వరకు పెండింగ్‌లో పెట్టారు. కేవలం రెండు పిటిషన్లను మాత్రమే పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలిపారు. ఇదే సమయంలో పనిచేసిన అబ్దుల్‌కలాం ఒకదాన్ని తిరస్కరించి, మరోదాన్ని అంగీకరించారు. భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ 34 మందికి క్షమాభిక్ష ఆమోదించగా, ఐదుగురి పిటిషన్లను కొట్టివేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇప్పటివరకు 33 క్షమాభిక్ష పిటిషన్లను అందుకున్నారు. ఇందులో 31 మంది పిటిషన్లను కొట్టివేశారు.