ఉర్దూ మన అందరి భాష

ఇది ముస్లింలదన్న భావన సరికాదు
ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది
మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది అందరి భాష అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరించడం తగదన్నారు. తాతలు, మా తాతలు అందరూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ విూడియంలోనే చదువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అనర్గళంగా మాట్లాడేవారు. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు. కాకపోతే ఒక మతాన్ని టార్గెట్‌ చేసి.. కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దుండిగల్‌ పరిధిలోని బహదూర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే కోరిన విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఇక్కడ ఉర్దూ విూడియం కాలేజీని మంజూరు చేయిస్తామని చెప్పారు. ఉర్దూ అంటే ఒక మతం భాష అని కొందరు మూర్ఖులు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మతం భాషగా చిత్రీకరించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఒక వైపు ప్రధాని మోదీ ఉర్దూను ప్రమోట్‌ చేసేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇక్కడున్న వారేమో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ.. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరిస్తున్నారు. కొందరు సన్నాసులు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. భాషను నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా, కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు.. ఉర్దూ విూడియంలో కూడా కళాశాలను మంజూరు చేయిస్తాం. ఉర్దూ, ఇంగ్లీష్‌, తెలుగు భాష వ్యత్యాసాలు తెలియవు. అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలనే విషయం మాత్రమే తెలుసని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలన్నా సంతోషమే అని, అందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. ఇదిలావుంటే కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి,సబితా ఇంద్రారెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్ది రేవంత్‌ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యాక పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. పైసలు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కన్నాడని ఆరోపించారు. పీసీసీ చీఫ్‌ అవ్వగానే సీఎం అయ్యినట్లు కలలుగంటున్నాడని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ది స్కీంల ప్రభుత్వమైతే.. కాంగ్రెస్‌, బీజేపీలవి స్కాంల ప్రభుత్వాలని అన్నారు. ప్రజాసంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్‌ కే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ ను మాత్రమే నమ్ముతున్నారని..రానున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీ అయి ఉండి కూడా రేవంత్‌ రెడ్డి ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌, బీజేపీ చేసింది ఏమి లేదని విమర్శించారు. ప్రజలందరి మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.