ఉల్లిఘాటు పెరగకుండా చూస్తం

3

– మంత్రి ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి):

ప్రభుత్వం ఉల్లి, టమాట ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టిందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఉల్లి పంట సాగు తగ్గడం వల్ల్నే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే దిగుమతులు కూడా తగ్గాయని ,మహారాష్ట్ర నుంచి గతంలో ఎక్కువగా పంట వచ్చేదన్నారు. మార్కెట్‌లోరకరకాల కూరగాయల ధరలు గతేడాదికన్నా తక్కువ ధరలకే రైతుబాజర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఉల్లిని కూడా తక్కువ ధరలకు రైతు బజార్లలో అమ్ముతున్నామని అన్నారు. అంతటా ఈ పథకాన్ని విస్తరింపచేస్తామని అన్నారు.  ప్రతీ వినియోగదారుడికి రెండేసి కిలోల వంతున కిలో రూ.20కే విక్రయిస్తున్నామని చెప్పారు. ధర నియంత్రణలోకి వచ్చే వరకు ఈ విక్రయాలు కొనసాగిస్తామని  పేర్కొన్నారు. ధరలను నియంత్రించేందుకు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేయాలని నిర్ణయించామని, రోజుకు వంద మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి 80 విక్రయకేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతామని ఈటెల వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి కొరత తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, మార్కెట్‌లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. గడిచిన నెల రోజులుగా ఉల్లిపాయలను రూ.21నుంచి 30 మధ్య అమ్ముతున్నాం. ఉల్లి ధరలను నియంత్రించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఆయన సూచించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. హైదరాబాద్‌లో రైతుబజార్లు, మన కూరగాయల కేంద్రాల్లో, రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఆగస్టు 5నుంచి ఉల్లి విక్రయకేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. కర్నూలు, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లిని రోజువారీగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్జడెట్‌లో రూ.వంద కోట్ల నిధి ఏర్పాటు చేసింది. అవసరమైతే ఆనిధులు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఉల్లి కొరత రాకుండా చూస్తామని అన్నారు. రైతులు ఉల్లిని పండించేలా ప్రోత్సహిస్తామని కూడా అన్నారు.

మెరుగైన విద్యుత్‌ సరఫరాకు ప్రతిపాదనలు పంపాలి

జిల్లాలో వ్యవసాయ పారిశ్రామిక, గృహావసరాలకు నాణ్యమైన నిర్విరామ విద్యుత్‌ సరఫరా చేసేందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జరిగిన జిల్లా స్థాయి విద్యుత్‌ కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వం నూతనంగా 98వేల కోట్లతో దయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీంలను ప్రవేశపెట్టిందన్నారు. ఈపథకాల క్రింద గ్రావిూణ ప్రాంతాలలో 325 కోట్లు, పట్టణ ప్రాంతాలలో 56 కోట్లు జిల్లాకు కేటాయించిందన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్‌ సరఫరాను చేసేందుకు 4-5గ్రామాలకు ఒక 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, గ్రామాల విద్యుద్దీకరణ వంటి మొదలగు పనులను గుర్తించి సంబందిత శాసనసభ్యులతో చర్చించి వారి సూచనల మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఎస్‌ఈ రంగారెడ్డిని ఆదేశించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపి బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రారంభించిన దీనదయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతియోజన, ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ స్కీంలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం అమలుకోసం జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ చైర్మన్‌గా సీనియర్‌ పార్లమెంట్‌ సబ్యుడు, కో చైర్మన్‌గా ఇతర ఎంపిలు, కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్‌, విద్యుత్‌ సంస్థ ఎస్‌ఈ మెంబర్‌ సెక్రటకీగా జడ్పీ చైర్‌పర్సన్‌ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారన్నారు. ఇది మొదటి సమావేశమని, జిల్లాలో మెరుగైన విద్యుత్‌కు ఎన్ని నిధులు అవసరమైనను సంబంధిత విద్యుత్‌ డీఈలతో చర్చించి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అట్టి ప్రతిపాదనలు రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపించి నిధులనుంచి మంజూరుకు కృషిచేస్తానని తెలిపారు. ఈసమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, జీవన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, టీఎస్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవిందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.