ఉల్లి ధరలపై సీఎం సవిూక్షిస్తున్నారు

– వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ

అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా, జగన్‌ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. సోమవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కిలో ఉల్లిని రూ. 25కే రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఉల్లి ధరలపై ఎప్పటి కప్పుడు సీఎం జగన్‌ పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. పోలపురం, అల్వార్‌, కర్నూలు నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని, ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.100 భారం భరిస్తుందని ఆయన తెలిపారు. రూ. 25 కోట్లతో 35 క్వింటాళ్ల వరకు ఇప్పటి వరకు సరఫరా చేసినట్లు చెప్పారు. హెరిటేజ్‌లో ఉల్లి ధరలు 135 రూపాయలు ఉందని, ప్రజలపై చంద్రబాబుకు అంత ప్రేముంటే రూ. 25 రూపాయిలకే ఇవ్వొచ్చు కదా అని అన్నారు. ఉల్లిధరలే కాదు హెరిటేజ్‌లో నిత్యవసర ధరలు భారీగానే వున్నాయని ఎమ్మెల్యే ధర్మశ్రీ విమర్శించారు.