ఉల్లి ధరల పెరుగుదలపై.. టీడీపీ వినూత్న నిరసన


– మెడలో ఉల్లిపాయల దండలతో అసెంబ్లీ ఎమ్మెల్యేలు
– అడ్డుకున్న భద్రతా సిబ్బంది
– ఉల్లిధరలు నియంత్రణలో వైకాపా విఫలమైంది
– ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీలో ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రతిపక్షం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చారు.  ప్లకార్డులతో నిరసనను తెలిపారు. అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఉల్లి దండలు, ప్లకార్డులకు అనుమతి లేదన్నారు.. దీంతో పోలీసులతో టీడీపీ ఎమ్మెల్యేల వాగ్వాదం జరిగింది. అంతకుముందు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని, ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి ధరలను వ్యతిరేకిస్తూ సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని ఆందోళన చేపట్టారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపించారు. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని, సబ్సిడీపై తక్కువ ధరలకే అందించామని ఆయన గుర్తు చేశారు. ఉల్లి ధరలు దిగివచ్చేవరకు తెదేపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఆందోళణ నిర్వహించిన అనంతరం వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.