ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేస్తుండటంతో పనులు జోరందుకున్నాయి. మంత్రులు జోగురామన్న, ఇందక్రకరణ్‌ రెడ్డిలతో పాటు ఎంపి నగేశ్‌ తదితరలుఉఎక్కడిక్డక ఉత్సాహంగా పూడికతీత పనుల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో చెరువ పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్ననీటి వనరులను బాగు చేయాలనే ఆశయంతో ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో చిన్ననీటి వనరులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులు పకడ్బందీగా చేపట్టేందుకు వీలుగా ఎప్పటికప్పుడు సర్వేలు, టెండర్లు, మంజూరు తదితర కార్యక్రమాలను అధికారులు పూర్తిచేస్తున్నారు. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించగానే వెంటనే పరిపాలన అనుమతులు ఇచ్చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 783 చెరువుల నిర్మాణానికి సంబంధించి అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అధికారులు డివిజన్ల వారీగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నారు. ఇందులో కొన్ని టెండర్లు దశ పూర్తిచేసుకొని పనులు కూడా మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో పనులు మొదలవగా అందులో రికార్డుస్తాయిలో పూడిక మట్టిని తొలగించారు.ఏటా వర్షాలు కురుస్తున్నా, వరద నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు లేవు. గ్రామానికో చెరువున్నా అవి ఉపయోగంలో లేకపోవడంతో వ్యవసాయానికి రైతులు ప్రధానంగా భూగర్భజలంపై ఆధారపడుతున్నారు. తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పూర్తయితే 80 వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని చెరువులకు సంబంధించి పూడిక మట్టి తొలగింపు పూర్తి కాగా.. కట్ట, తూము తదితర పనులు చేపడుతున్నారు. ఇంకా 50 శాతానికి పైగా చెరువుల పనులు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని చోట్ల టెండర్లు పిలిచిన గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో రెండోసారి టెండర్లు పిలవాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో పూడిక మట్టిని తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో పనులు మెల్లగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పూడికమట్టి  పొలాల్లో వేసుకునేందుకు వీలుగా లేకపోవడంతో  సవిూపంలోని గుంతలను మట్టితో పూడ్పించారు. దాదాపు అన్నిచోట్ల తూము, అలుగు పనులు జరుగుతున్నాయి. చెరువుల్లో పూడిక మట్టిని తొలగిస్తే ఆశించిన మేరకు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.  గ్రామాల్లో రైతులు పెద్దసంఖ్యలో పూడిక మట్టిని తీసుకెళుతుండటంతో పనులు వేగంగా పూర్తి అవుతున్నాయి. ఒక్కో రైతు ఎకరం భూమిలో పూడికమట్టి వేసుకోవాలంటే 40-50 ట్రాక్టరు ట్రిప్పులు అవసరం. ఈ లెక్కన రైతులకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుంది.ఆర్థిక కారణాలతో  కొన్ని గ్రామాల్లో పూడిక మట్టిని తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడంలేదు.  నల్లరేగడి భూములు ఉన్నచోట్ల ఎక్కువ మంది రైతులు మట్టిని తీసుకెళ్లేందుకు రావడం లేదు. ఏళ్ల తరబడి చెరువులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పూడిక పేరుకు పోవడంతో చాలా చెరువుల్లో ఆయకట్టు తగ్గిపోయింది. కొన్నిచోట్ల నీరు నిల్వ లేకపోవడంతో భూములుగా బీడులుగా మారాయి. చెరువుల పునరుద్ధరణ పూర్తయితే ఆయకట్టు పెరుగుతుంది.