ఊరూ వాడా ఒక్కటై సార్‌కు నివాళి
– భావజాల వ్యాప్తిలో జయశంకర్‌సార్‌ది కీలకపాత్ర
– ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్,జూన్ 21(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించేందకు మూడు తరాలుగా జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని తెలంగాణా కొసరాఖరులో ఉండగా అసువులుబాసిన ప్రొఫెసర్ జయశంకర్ వర్దంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు పూల మాలలు వేయడమే కాక విగ్రహాలు అందుబాటులో ఉన్న చోట అక్కడ టీఆర్‌ఎస్ నేతలు విద్యావంతులు, ఉద్యమకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా పలుచోట్ట రక్తదాన కార్యక్రమాలు, అన్నదానం, ఆసుపత్రుల్లో పాలు పండ్లు పంపిణీ కార్య క్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్‌లోగల జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవిందర్‌తోపాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా మంత్రిమాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రాన్ని కళ్లారా చూడకుండానే అసువులు బాయడం బాద కలిగించినా ఆయన ఆశయా లను పార్టీనేతలు, ఉద్యమకారులు స్పూర్తిగా తీసుకుని ముందుకు నడిపిస్తారన్నారు. ఆయన సూచించిన మార్గంలోనే తెలంగాణా ప్రభు త్వం ప్రతి అడుగు వేస్తుందన్నారు. ఆయన తెలంగాణాను సమగ్రంగా తీర్చి దిద్దేందుకు అనేక విధాలుగా కృషి చేశారన్నారు. తెలంగాణా ఉద్యమం మూడు తరాలుగా జరుగగా చివరాఖరు వరకు ఉన్న వ్యక్తుల్లో జయశంకర్ సార్ ప్రధాన వ్యక్తి అన్నారు. ఆయన కన్న కలల మేరకే తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.
జయశంకర్ బాటలోనే నడుస్తున్నాం: కెసిఆర్
తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ అడుగజాడల్లోనే తెలంగాణ ప్రభుత్వం సాగుతోందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సార్‌ను ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. జయశంకర్ ఐదో వర్థంతి సందర్భంగా కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ వస్తేనే ఇక్కడి ప్రాంత ప్రజల బతుకులు బాగుపడతాయని ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని సీఎం అన్నారు. సార్ వర్ధంతి సందర్బంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. జయశంకర్ సార్ ఎల్లప్పుడూ ప్రజల మదిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఆనాడు జయశంకర్‌సార్ కలలు కన్నట్లే ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. ఈమేరకు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆచార్య కాంస్య విగ్రహానికి టీఆర్‌ఎస్ నేత, ఎంపీ కే కేశవరావుతోపాటు పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కేకే మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. సార్ బాటలో నడిచి బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. అదే బాటలో ఇప్పుడు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.