ఎంఐఎం ముందు మోకరిల్లిన కెసిఆర్‌

ఇంతకన్నా సిగ్గుచేటు మరోటి లేదు

ఫామ్‌హౌజ్‌ సిఎం కెసిఆర్‌ను చిత్తుగా ఓడించాలి: సురవరం

ఖమ్మం,నవంబర్‌28(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ తమ ముందు తలవంచాల్సిందేనని అక్బరుద్దీన్‌ అన్నారని, అలాంటి ఎంఐఎంతో అంటకాగడానికి కేసీఆర్‌కు సిగ్గుందా? అని సీపీఐ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇంతకన్నా దారుణం మరోటి లేదన్నారు. బుధవారం ఖమ్మంలో జరుగుతున్న ప్రజాకూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… దళితులు, మైనార్టీలు, మేధావులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. గోరక్ష పేరుతో చిత్రవధకు గురిచేస్తున్నారని, దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీపై టీడీపీ పోరాడుతుంటే… బీజేపీతో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోందని సురవరం విమర్శించారు. దళితులపై హత్యాకాండ కొనసాగుతుంటే కేసీఆర్‌ ఒక్కమాట మాట్లాడలేదని, బీజేపీకి కేసీఆర్‌ భయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓ వైపు బీజేపీతో, మరోవైపు ఎంఐఎంతో కేసీఆర్‌ అంటకాగుతున్నారన్నారు. ఇచ్చిన హవిూలు కేసీఆర్‌ నిలబెట్టుకోకపోగా ధర్నాచౌక్‌ను రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు అసలు ఓటు అడిగే అర్హత లేదన్నారు. గెలిస్తే సేవ చేస్తా… ఓడితే

ఫామ్‌హౌస్‌కు వెళ్తానని కేసీఆర్‌ తన ఓటమిని ఒప్పుకున్నారని, బీజేపీ తొత్తు కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సురవరం పిలుపు ఇచ్చారు. ఇలాంటి నేత కారణంగా తెలంగాణ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కూటమి అభ్యర్థులను గెలపించాలని సురవరం పిలుపునిచ్చారు. కెసిఆర్‌ కుటుంబాన్ని ఓడించి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌, ,చంద్రబాబు, ఉత్తమ్‌, రమణ, గద్దర్‌, భట్టి విక్రమార్క, మందకృష్ణ తదితరులు పాల్గొన్నారు.