ఎంపిగా బండి సంజయ్ చేసిందేవిూ లేదు
వడ్లు కొనే విషయంలో ఎందుకీ డ్రామాలు
మండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్,అక్టోబర్29(జనంసాక్షి): కరీంనగర్ ఎంపీగా జిల్లాకు లేదా హుజూరాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేవిూ లేదని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. వడ్లు కొనే విషయంలో కూడా గట్టిగా కేంద్రం నుంచి హావిూని రాబట్టలేక పోయారని అన్నారు. దీనిని పక్కన పెట్టి దీక్షలతో డ్రామాలు ఆడారని, దీనిని ప్రజలు నమ్మరని అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్తామని.. ప్రజలకు విూరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు
కనిపిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే బీజేపీ చేసిన అభివృద్దా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసిందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ టీఆర్‌ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దళిత బంధుపై బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నెత్తిన గ్యాస్ సిలిండర్ దెబ్బ పడటం, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని మంత్రి అన్నారు. ఇప్పటికే పలు సంస్థలు, విూడియా విభాగాలు చేసిన సర్వేలు టీఆర్‌ఎస్ విజయం ఖాయమని తేల్చాయన్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాసంక్షేమం, పథకాలు, అభివృద్ధి తదితర విషయాల్లో తాము ప్రజలకు చేసిన మేలును మాత్రమే చెప్పామన్నారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించేందుకు ఏమైనా హావిూ ఇచ్చారా? అని ప్రశ్నించారు. దళితబంధుపై లేఖలు రాసి ఆపేసిందని ధ్వజమెత్తారు. తాము రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రైతు, పేదల సంక్షేమానికి పట్టం కట్టామన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో రైతుల పాలిట శాపంగా మారిన నల్లచట్టాలను తీసుకువచ్చిందన్నారు. బీజేపీ అంటే ప్రజా సంక్షేమ పథకాల సబ్సిడీల్లో కోతలు, ప్రజలపై పన్నుల వాతలు’అని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి ఉద్యోగులను రోడ్డుకీడ్చారన్నారు.