ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం

` దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో కత్తితో దాడి
` సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలింపు
` ఆసుపత్రి వద్ద భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్‌రావు
` నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి గవర్నర్‌ ఆదేశాలు
` ఘటనను ఖండిరచిన మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు
సిద్దిపేట (జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో కలకలం రేగింది. ఆయన కడుపులో ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రభాకర్‌రెడ్డిని గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రచారం చేస్తూ సూరంపల్లిలో పాస్టర్‌ కుటుంబాన్ని ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వారి ఇంటి నుంచి బయటకు వస్తున్న ప్రభాకర్‌ రెడ్డితో ఓ వ్యక్తి కరచాలనం చేసేందుకు వచ్చినట్లుగా చేయి చాపుతూ వచ్చి అకస్మాత్తుగా కడుపులో కత్తితో పొడిచాడు. వెంటనే ఆయన పక్కనున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సదరు వ్యక్తిని పారిపోకుండా పట్టుకున్నారు. మరికొందరు వెంటనే ప్రభాకర్‌ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. మొదటగా గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి అంబులెన్సులో ప్రభాకర్‌ రెడ్డిని సికింద్రాబాద్‌ యశోదకు తరలించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని రాజుగా పోలీసులు గుర్తించగా.. పార్టీ కార్యకర్తలు, స్థానికులు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న ఆయన నారాయణఖేడ్‌కు వెళ్లకుండానే వెంటనే గజ్వేల్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని స్థానికుల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు.
వైద్యులు ఆయనకు అబ్‌డామన్‌ పరీక్ష నిర్వహించి.. కత్తి గాటు ఎంత వరకు ఉందో పరిశీలించారు. మరోవైపు మంత్రి హరీశ్‌ రావు ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. కార్యకర్తలెవరూ సంయమనం కోల్పోకూడదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు. గవర్నర్‌ తమిళి సై, మంత్రి కేటీఆర్‌ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. ఎంపీపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు కార్యకర్తలెవరూ రాకూడదని.. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ తెలియజేస్తామని మంత్రి హరీశ్‌ రావు కార్యకర్తలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించిన తమిళిసై.. దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని గవర్నర్‌ ఆదేశించారు.

పూర్తిస్థాయి విచారణ జరపాలి : రేవంత్‌రెడ్డి
ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. కాంగ్రెస్‌ పార్టీ హింసను నమ్ముకోదని, అహింసా మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న పార్టీ అని తెలిపారు. దాడి చేసింది ఎవరైనా కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ఈ విషయంలో పారదర్శకంగా విచారణ జరిపి విషయాలను బయటపెట్టాలన్నారు.

ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు
తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
నవంబర్‌ 1న బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
హైదరాబాద్‌ (జనంసాక్షి):మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామని.. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టంచేశారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడిని బీజేపీ ఖండిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. మూడో జాబితాపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్‌ 1వ తేదీన బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేస్తామన్నారు. నవంబర్‌ 1న జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ మీటింగ్‌ జరుగుతుందని.. సీఈసీ మీటింగ్‌ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. అందరి అభిప్రాయాలి స్వీకరించాకనే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. జనసేనతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని.. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అంటూ తెలిపారు. అభ్యర్థుల ప్రకటనతోపాటు.. ఒకేసారి.. సమగ్రమైన మ్యానిఫెస్టో విడుదల చేస్తామని.. అందరి కోసం మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నివురుగప్పిన నిప్పులా యువత అసంతృప్తితో రగిలిపోతున్నారని.. కేటీఆర్‌ పగటి కలలు కంటున్నారంటూ కిషన్‌ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ప్రతినెలా చివరివారంలో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామో.. అదే తరహాలో ఉద్యోగ ఖాళీలు రాష్ట్రంలో భర్తీ చేస్తామన్నారు. ఉపాధిపరంగా అన్ని రకాల వృత్తులను ప్రోత్సహిస్తామని స్పష్టంచేశారు.