ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
అమరావతి, జూన్13(జనం సాక్షి) : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు ఆంధప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనతో పాటు ఐఛ్చికాల నమోదుకు అవకాశం కల్పించారు. జూలై 1 నుంచి 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 4, 5 తేదీల్లో ఐఛ్చికాలు నమోదు పూర్తి చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ పాండాదాస్ తెలిపారు. జూలై 7న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. క్రీడలు, ఎన్‌సీసీ, విభిన్న ప్రతిభావంతులకు రెండో విడతలో సీట్లు కేటాయిస్తారు. వీరి కోసం విజయవాడ ఆంధ్రా లయోల కళాశాల, విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి కళాశాలలో చేరేందుకు ఈనెల 15 వరకు గడువు పొడిగించారు. మొత్తం 60,943 మందికి సీట్లు కేటాయించగా.. వీరిలో 50,793 మంది విద్యార్థులు ప్రవేశాలకు ఆసక్తి చూపారు. ఇప్పటివరకు కళాశాలలో చేరింది మాత్రం 35,773 మంది మాత్రమే.