ఎట్టకేలకు అంగన్‌వాడీలకు పారితోషికాలు
కలెక్టరేట్, జనంసాక్షి: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తూ బూత్ లెవల్ అధికారులుగా వ్యవహరించిన అంగనవాడీ కార్యకర్తలకు ఎట్లకేలకు వారికి రావాల్సిన పారితోషికాలను అధికారులు చెల్లించారు. శనివారం ఆదిలాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కొకరికి రూ.1500 చొప్పున బాకాయి వేతనాలు ఉప తహసీల్దార్ జాకీర్ వారికి అందించారు. పారితోషికాలను చెల్లించాలని గత బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. తలొగ్గిన అధికారులు ఖాజానా ఖాఖలో బిల్లులు చేయించి వారికి అందజేశారు. ఐదేళ్లుగా ఓటరు జాబితాల్లో పేర్లు నమోదు చేస్తున్న తమకు ఇప్పటివరకు రూ. 3750 మాత్రమే అందజేశారని అంగన్‌వాడీల సంఘం కార్యదర్శి(ఏఐటీయూసీ) కె. రాధ తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ. 3వేలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇంతవరకు అందించలేదన్నారు. మిగతా పెండింగ్ వేతనాలను కూడా త్వరిగతిన అందించాలని డిమాండ్ చేశారు.