ఎట్లాపుతరు మార్చ్‌ను ?

తెలంగాణలో సకల జనులు ‘సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం’ తర్వాత అంతకన్నా పెద్ద ఎత్తున తెలంగాణ మార్చ్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నరు. మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోనే గతంలో నిర్వహించిన ‘మిలియన్‌ మార్చ్‌’ ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. దాన్ని మించిన ఉద్యమంగా చరిత్రలో ఈ నెల 30న నిర్వహించే ‘తెలంగాణ మార్చ్‌’ నిలిచిపోనుందని తెలంగాణ ఉద్యమ సారథులు, తెలంగాణ ప్రజలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నరు. ఆ రోజున ప్రత్యక్షంగా పాల్గొనేందుకు తెలంగాణ యువకులు ఉవ్విళ్లూరుతున్నరు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం గురించి భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ‘తెలంగాణ మార్చ్‌’కు ముందు, తర్వాత అని సంభోదిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతటి కీలక పోరాటంలో తాము కూడా భాగస్వాములు కావాలని ప్రతి తెలంగాణవాది కోరుకుంటున్నడు. యావత్‌ తెలంగాణ ప్రజలు ఈ మార్చ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరోసారి కేంద్రానికి చాటి చెప్పి, తమ కోరికను నెరవేర్చుకోవాలని, ఆ రోజు ఢిల్లీలోని పార్లమెంటు పెద్దల చెవులు రింగు మనేలా నినదించాలని బలమైన ఆకాంక్షతో ఉన్నరు.  దీనికి గతంలో మిలియన్‌ మార్చ్‌కు వేదికైన ట్యాంక్‌ బండ్‌నే ఈసారి కూడా ఎంచుకున్నరు. నిరసన తెలుపాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఉద్యమ సారథులు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ మొదలుకొని సీఎం, గవర్నర్‌ దాకా అనుమతి కోసం తిరిగారు. కానీ, ఎవరు కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించలేదు. పైగా, మార్చ్‌ నిర్వహించే 30న వినాయక నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి అనుమతివ్వ లేమన్నారు. మరోసారి అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ఉంది కాబట్టి అనుమతి ఇవ్వడం కుదరదన్నరు. దీనికి తెలంగాణవాదులు ‘రాష్ట్రం ఇవ్వండి’, మీరు చెప్పినట్లు చేస్తామన్నరు. ఈ విషయం మా పరిధిలో లేదంటే మా పరిధిలో లేదంటూ సీఎం, గవర్నర్‌ లాంటి వాళ్లు కూడా తప్పించుకున్నారు. ఇక సీమాంధ్ర నాయకుల సంగతి సరేసరి. మార్చ్‌ వల్ల శాంతిభద్రతల సమస్యలని ఏదేదో అవాకులు చెవాకులు మాట్లాడారు. అయినా, తెలంగాణవాదులు వెనక్కు తగ్గక పోవడంతో ఇక లాభం లేదనుకుని సీఎం కిరణే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణవాదులను బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నరు. అక్టోబర్‌ 20 వరకు వాయిదా వేసుకోండి.. ఆ తర్వాత మీ ఇష్టం అంటున్నరు. దీనిపై కూడా తెలంగాణవాదులు ఘాటుగానే స్పందించారు. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలంటే తెలంగాణ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అంతే సీఎం మళ్లీ పాత పాటే అందుకున్నారు. నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు ఉన్న కారణంగా అనుమతివ్వడం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణవాదులు మాత్రం మార్చ్‌ జరిగి తీరుతుందని నినదిస్తూనే ఉన్నరు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తెలంగాణలో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉద్యమ కురు వృద్ధుడు, పక్కా తెలంగాణవాది, తెలంగాణ ప్రజల బాపూజీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు శనివారం హుస్సేన్‌సాగర్‌కు దగ్గరలో ఉన్న జలదృశ్యంలో పూర్తయ్యాయి. నిత్యం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆరాటపడి, జీవిత చరమాంకం వరకు తెలంగాణ ఇవ్వాలని పోరాడిన బాపూజీ పోతూ పోతూ కూడా మంచే చేసి పోయారు. ఆయన మృతితో యావత్‌ తెలంగాణ శోకసంద్రంలో మునిగిపోయింది. బాపూజీ మృతికి సంస్మరణ సభను ఈ నెల 30నే జలదృశ్యంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటుంది. బాపూజీ సంస్మరణ సభ ఆ రోజునే నిర్వహించాలని అనుకోవడం కాకతాళీయమే అయినా, అదే రోజు తెలంగాణవాదులు మార్చ్‌కు పిలుపునిచ్చారు. అదే రోజు నిమజ్జనం జరుగుతుంది. అదే రోజు బాపూజీ సంస్మరణ సభ ఉంటుంది. ఈ మూడు కార్యక్రమాలకు కూడా సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలనుకుంటున్నరు. వీటిలో కేవలం తెలంగాణ మార్చ్‌కు మాత్రమే ప్రభుత్వం ఇవ్వకుండా ఉండగలదు. మిగిలిన రెండు ఎట్లాగో జరిగేవే. ఆ రెండు కార్యక్రమాలు కూడా ట్యాంక్‌ బండ్‌కు సమీపంలోనే జరుగుతాయి. కాబట్టి, ఇక తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా పోయింది. మిగిలిన రెండు కార్యక్రమాలకు వచ్చే వారే ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటారు. తెలంగాణ మార్చ్‌ను కూడా నిర్వహించుకుంటరు. మార్చ్‌ను అడ్డుకుంటామని అన్న వాళ్లకు, అనుమతివ్వం అన్న వాళ్లకు దిమ్మ తిరిగేలా జవాబు చెబుతారు. కాబట్టి, తెలంగాణ మార్చ్‌ అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదు. మార్చ్‌ జరుగుతుంది. మరోసారి నాలుగున్నర కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రపంచానికి తెలుస్తుంది.