ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు?


` మైండ్‌సెట్‌ మార్చుకోండి
` ఆర్మీ అధికారులపై సుప్రీం సీరియస్‌
` స్త్రీలను ప్రవేశపరీక్షలకు అనుమతినిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ
` వారిని అడ్డుకోవడం లింగ వివక్ష కిందకు వస్తుందని వ్యాఖ్య
దిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి): నేషనల్‌ డిఫెన్స్‌ అకాడవిూ(ఎన్‌డీఏ)లో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వచ్చే నెలలో జరగబోయే ఎన్‌డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆర్మీ నిర్ణయాలు మహిళలపై వివక్ష చూపించేలా ఉన్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ఇలాంటి మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సూచించింది. సెప్టెంబరు 5న ఎన్‌డీఏ పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం సైన్యం విధానాలపై అసహనం వ్యక్తం చేసింది. సాయధ బలగాల్లో పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, కానీ విూరెందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించింది. దీనికి ఆర్మీ స్పందిస్తూ విధాన నిర్ణయం ప్రకారమే మహిళలు అనుమతించట్లేదని తెలిపింది.అయితే ఆర్మీ స్పందనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘లింగ వివక్ష ఆధారంగా విూ విధాన నిర్ణయం ఉంది. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ లాంటి వాటిల్లో మహిళలను అనుమతిస్తుంటే విూరెందుకు అనుమతించట్లేదు. గతంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేగానీ విూరు శాశ్వత కమిషన్‌ ఇవ్వలేకపోయారు. ప్రతీసారి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు. ఇది పూర్తిగా విూ మానసిక వైఖరే. దాన్ని మార్చుకుంటే మంచిది. ఎన్‌డీఏ పరీక్షకు మహిళలు హాజరయ్యేందుకు మేం అనుమతినిస్తున్నాం. తుది తీర్పునకు లోబడి ప్రవేశాలు జరగాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది.