ఎన్నికలంటే కాంగ్రెస్ పారిపోతోంది
గెలుస్తామంటున్న వారికి భయమెందుకో
వారికి మరోమారు గుణపాఠం తప్పదు
ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: కడియం
వరంగల్,ఆగస్ట్30(జనం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, చెప్పినట్లుగానే వందసీట్లు గెల్చుకుని మరోమారు సిఎంగా కెసిఆర్ ఉంటారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు.ప్రగతి నివేదిక సభ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలుస్తుందన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ది గురించి వివరించడమే సభ లక్ష్యమన్నారు. నాలుగేళ్లలో టిఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రగతి పథకాలను నివేదించడానికే భారీ బహిరంగ సభ పెట్టామని అన్నారు. ఓడిపోతామని భయపడేవాళ్లు ఎన్నికలకు వెళ్లరన్న కనీస అవగాహన కాంగ్రెస్‌కు లేదని గురువారం నాడిక్కడ అన్నారు. ఆయన తనను కలసిన విూడియా మిత్రులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.సొంత జిల్లా నల్గొండలో జానారెడ్డిని, కోమటిరెడ్డిని సమన్వయం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి 75 సీట్లు గెలుస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అంత నమ్మకం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ముందస్తు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా గెలిచే నమ్మకముంటే ఎంత ముందుగా ఎన్నికలొస్తే అంత తొందరగా అధికారం విూకు వస్తది కదా…ఆ నమ్మకం లేకే ముందస్తు ఎందుకని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరకుమార్ ప్రగల్భాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్బాలు ఒక్క తీరుగా ఉన్నాయన్నారు. యుద్దానికి వెళ్లే ముందు కౌరవుల తలలు, తలపాగలు తెస్తానన్న ఉత్తరకుమారుడు, యుద్ధంలో కౌరవులను చూసి యుద్ధభూమి నుంచి పారిపోయారని ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో అదే జరగబోతోందన్నారు. ప్రగల్బాలు పలుకుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల తర్వాత అదే గతిపడుతుంది. ప్రగతి నివేదన సభ చూసిన తర్వాత పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది. హౌజింగ్ మంత్రిగా అక్రమాలకు పాల్పడి, నోట్ల వాహనంతో పట్టుబడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతివ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. గ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే దోచుకోవడం, దాచుకోవడం, అక్రమాలు, సెటిల్ మెంట్లు చేయడం తప్ప చేసిందేమి లేదని కడియం దుయ్యబట్టారు.ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల విూద ఉన్ననమ్మకంతోనే ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల మూడు నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయలేదన్నారు. సిఎం కేసిఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రధాని, ఇతర రాష్ట్రాల సిఎంలుకూడా ఇన్ని ఎలా అమలు చేశారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని కడియం అన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పదేపదే విమర్శలు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం…ప్రపంచంలో 8వ వింత ఇది, జాతీయ జలవనరుల కమిషన్ ఇంజనీర్లు కూడా ప్రశంసించారన్నారు. 46వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మరో గొప్ప పథకం మిషన్ భగీరథ అన్నారు.టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రజల సంక్షేమం, అభివృద్ధికి హావిూ ఇవ్వని పథకాలు ప్రవేశపెట్టి దేశంలో తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రం చేసిందన్నారు.వ్యవసాయానికి 24 గంటల ఉచితకరెంటు, పెట్టుబడి కింద ఏటా 8000రూపాయల రైతుబంధు, రైతుకుటుంబాన్ని ఆదుకునే రైతు బీమా, ఆడపిల్ల పెళ్లికి 1,00,116 రూపాయలు, గర్భిణీ స్త్రీల కోసం ఆరు నెలలకు 12వేల రూపాయలు, అమ్మఒడి ద్వారా నెలలు నిండిన మహిళలను దవాఖానాకు తీసుకెళ్లే పథకం, తల్లీబిడ్డకు కావల్సిన వస్తువులిచ్చే కేసిఆర్ కిట్, కంటివెలుగు, దేశంలో అత్యధికంగాగురుకుల విద్యాలయాల ఏర్పాటు, ఆరు లక్షల మంది బాలికలకు బాలికా ఆరోగ్య రక్ష కిట్లు, ఇంకా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు కేసిఆర్ నాయకత్వంలో అమలు జరుగుతన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాకొక ముఖ్యమంత్రి, కొన్నిజిల్లాల్లో ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రులెలా అవుతారో కాంగ్రెస్ వాళ్లు చెప్పాలన్నారు.