ఎన్నికలకు అధికార పార్టీ సన్నద్ధత

విపక్షాలకు దీటుగా ప్రచారానికి సన్నాహాలు
ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి
మరోసారి అధికార పీఠం కైవసం చేసుకోవాలని తెదేపా వ్యూహాలు
అమరావతి, జూన్‌14(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌లో ఎన్నికల కోలాహలం అప్పుడే కనిపిస్తుంది. విపక్షాల పాదయాత్రలు, బస్సుయాత్రలు పేరిట అనధికారంగా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా అధికార తెలుగుదేశం పార్టీ సైతం అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. నాలుగేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి అధికార పీఠం కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గ్రామాల వారీగా చేసిన ప్రతీ పని ప్రజలకు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఘనంగా చాటనుంది. నాలుగేళ్లలో 110కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అధికార పార్టీ లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల హావిూల్లో లేనివి సైతం తెదేపా ఆచరణలో పెట్టింది. పట్టిసీమ నిర్మాణంతో డెల్టాలో కష్టాలు తీర్చడంతో పాటు రాయలసీమకు సైతం నీరు తరలించారు. ఎన్నడూ లేని విధంగా జూన్‌ నెలలోనే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి సైతం గండికోట జలాశయం ద్వారా నీటిని అందించారు. దీన్ని రాజకీయ అనుకూలంగా మలచుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది. చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ కేంద్రంగా ఎన్నో కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. తిరుపతి పరిసర ప్రాంతాలకు సైతం ఐటీ, ఎలక్టాన్రిక్స్‌, మొబైల్‌ తయారీ పరిశ్రమలు తరలివచ్చాయి. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రాయలసీమకే మణిహారంగా నిలిచే కియా మోటార్స్‌ గురించి భారీస్థాయిలో ప్రచారం చేయనున్నారు.   కియాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం రాయలసీమకు తీసుకురావటం జరిగింది. కియా మోటార్స్‌ ద్వారా భారీస్థాయిలో ఆప్రాంత వాసులకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కియా మోటార్స్‌ కంపెనీ గురించి రాయలసీమ వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంలో తెదేపా అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం తీరునుసైతం ప్రజల్లో ఎండగట్టేందుకు తెదేపా నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్రంతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ, అమిత్‌షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వారి తీరును ప్రజల్లో ఎండగట్టేలా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇదే విధానాన్ని గ్రామ స్థాయి నేతలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేలా చంద్రబాబు ఇప్పటికే నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రత్యేక ¬దా ఇవ్వకుండా ప్రజలకు చేసిన మోసాన్ని, పోలవరాన్ని అడ్డుకొనేందుకు చేస్తున్న కుట్రలను, నిధులు ఇవ్వకుండా రాష్ట్రంపై పెత్తనం చేసేలా వ్యవహరిస్తున్న తీరును, తితిదేపై కేంద్రం పెత్తనం చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్న నాటకాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేలా అధిష్టానం ఇప్పటికే కిందిస్థాయి నేతలను ఆదేశించింది. దీంతో తెదేపా నేతలు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.