ఎన్నికల్లో వాడుకొని.. ఇప్పుడు తోలు తీస్తారా?
చంద్రబాబు తీరు దారుణంగా ఉంది
వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
పది తలలున్న పెద్ద రాక్షసుడు చంద్రబాబు
వైసీపీ నేత అంబటి రాంబాబు
విజయవాడ, జూన్19(జనం సాక్షి) : నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాలు కల్పించాలని అడిగితే తీసేస్తాం, విధుల్లోకి రానివ్వకుండా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడటం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగిరమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు. మత్సకారులను బీసీల్లో నుంచి ఎస్టీల్లో చేరుస్తానని మేనిఫెస్టోలో పెట్టిన హావిూని నెరవేర్చాలని చంద్రబాబును కలవడానికి వెళితే వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని తగ్గించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కనీస వేతన చట్టం ఉంది అనే విషయం తెలియకుండా చంద్రబాబు మాట్లాడటం దారుణమని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు టీడీపీకి బీసీలు పట్టుకొమ్మలు అని, ఇప్పుడు తాట తీస్తా, తోలు తీస్తా అంటున్నారని తెలిపారు. బీసీలను ఎన్నికల్లో పావులుగా వాడుకుని ఇప్పుడు తరిమికొడతారా? అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని అడగడం తప్పా? మేము ఏమైనా విూ దోపిడిలో వాటాలు ఆడిగామా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే బీసీల విూద ప్రతాపం చూపించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా సంఘటితమై చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్నారు. ఆలయ కేశఖండనశాలలో పనిచేసే క్షురకుల విధుల బహిష్కరణతో గత ఐదు రోజులుగా తలనీలాల సమర్పణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.పది తలలున్న పెద్ద రాక్షసుడు చంద్రబాబుా అంబటి రాంబాబునాయిబ్రాహ్మణులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగటం దారుణమని ఆయన మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులని, అలాంటి వారిపై చంద్రబాబు వీరత్వం చూపాలనుకున్నారని తప్పుబట్టారు. మంగళవారం ఆయన మాటాడారు. ‘కేంద్రంపై పోరాటమంటూ వారంరోజులుగా చంద్రబాబు తెగ ప్రచారం చేసుకున్నారు. చివరకు ఉరుమురిమి మంగలం విూద పడ్డట్టు చంద్రబాబు నాయి బ్రాహ్మణుల విూద పడ్డారు. ప్రజాదేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవునిలా లేదు.ఆయన పది తలలున్న పెద్ద రాక్షసుడు’ అని అంబటి దుయ్యబట్టారు. జాలర్లు, బ్రాహ్మణుల విూద కూడా ఆయన దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. వివిధ వర్గాల ప్రజల ఉద్యమాలను అణచివేయడం తప్ప వారి సమస్యలను చంద్రబాబు ఎప్పుడైనా పరిష్కరించారా? నిలదీశారు. ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పచ్చచొక్కా వేసుకోవడం మంచిదని, ఆయనకు మహానాడులో సన్మానం చేయాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయటం, అసంతృప్తవాదులను సీఎం దగ్గరకు తీసుకెళ్లటమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులను రాత్రి పిలిపించి బలవంతంగా సమ్మె విరమింపచేశారని పేర్కొన్నారు.