ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం ఖాయం

3

– చైనా మనకు అడ్డంకి కాదు

– కేంద్రవిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ,జూన్‌ 19(జనంసాక్షి): ఎన్‌ఎస్‌జీ లో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు. రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వం పాలనపై ఆదివారం మంత్రి సుష్మా విూడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. బహుషా ఈ సంవత్సరం చివరికల్లా సభ్యత్వం వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  అణు సరఫరా దేశాల కూటమిలో చేరే విషయంలో భారత్‌ను చైనా అడ్డుకోవడం లేదని విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు. చైనా కేవలం విధివిధానాల గురించి మాత్రమే మాట్లాడుతోందని, చైనాను ఒప్పించగలమనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు. వేరే దేశాలు ఎన్‌ఎస్‌జీలోకి వస్తామంటే మన దేశం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పడంలేదన్నారు. మరో 23 దేశాలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం 23 సభ్యదేశాలతో చర్చలు జరుపుతున్నామని సుష్మా చెప్పారు. ఈ ఏడాదిలోనే భారత్‌కు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం వస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలపై కూడా మాట్లాడిన ఆమె సత్సంబంధాల కోసం భారత్‌ చేయాల్సిందంతా చేసిందని, ఇక స్పందించాల్సింది పాకిస్థానేనని చెప్పారు. మోదీ ఆకస్మిక పర్యటన ఇందులో భాగమేనన్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్‌, ఖతర్‌ వంటి దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించి మన దేశంతో ఆయా దేశాల ఆర్థిక సంబంధాలను ధృడపరిచారని వివరించారు. పాకిస్థాన్‌తో విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు కాలేదని తెలిపారు. పఠాన్‌కోట్‌ సంఘటనపై పాకిస్థాన్‌ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న హింసాత్మక సంఘటనలు దురదృష్టకరమన్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలు చేపట్టిందని వివరించారు. ఈమేరకు తమ విదేశాంగ శాఖకు లేఖ కూడా పంపిందని తెలిపారు. అయితే అధికారులు కొన్ని మార్పులు సూచిస్తూ ఈడీ అధికారులకు తిరిగి పంపించారని పేర్కొన్నారు. వారి నుంచి సమాధానం రాగానే దీనిపై స్పందిస్తామన్నారు. ఉగ్రవాదంపై పాక్‌ ద్వంద్వ వైఖరి తగదని సూటిగా చెప్పారు. చర్చలు, ఉగ్రవాదం ఏకకాలంలో సాగవని చెప్పారు. పాక్‌తో అన్ని వివాదాలపై చర్చల ద్వారా పరిష్కారం కనుగొంటామని, అయితే ఇందులో మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ ప్రయాణాలపై వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ తోసిపుచ్చారు. మోదీ విదేశాలు పర్యటించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. దేశం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తుందని..ఇంట్లో కూర్చుని ఉంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రావని ఆమె అన్నారు. వృద్ధి చెందాలంటే పెట్టుబడులు అవసరమని దానికోసం మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈరోజు భారత్‌ మాట్లాడుతుంటే.. ప్రపంచం వింటుంది అంత గొప్పగా భారత్‌ ఎదిగిందని ప్రశంసించారు.2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. ఈ రెండేళ్లలో ఎఫ్‌డీఐ మార్గం ద్వారా దేశానికి రూ.3,69,000కోట్లు వచ్చాయని.. 43శాతం ఎఫ్‌డీఐలు పెరిగాయన్నారు. ‘స్మార్ట్‌ సిటీ’ పథకం ద్వారా యూఎస్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం కేవలం ఒక్క ఆస్ట్రేలియాతో 13 రకాల ఒప్పందాలు చేసుకున్నామని.. ‘నమామి గంగ’ కార్యక్రమానికి జర్మనీ, జపాన్‌ దేశాలు తోడ్పడుతున్నాయని తెలిపారు. మోదీ విదేశీ పర్యటనల వల్లే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. రెండేళ్లలో 55 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు భారత్‌లోకి ఎఫ్‌డిఐ రూపంలో వచ్చాయన్నారు. ప్రపంచ దేశాల్లో ఇంకా 62 దేశాలతో భారత్‌ సంబంధాలు ఏర్పరచుకోలేదని, త్వరలోనే ఈ దేశాలకు భారత అధికారులు వెళ్తారని సుష్మ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో 43 శాతం ఎఫ్‌డీఐలు పెరిగాయని అన్నారు.ఈ ఏడాదిలోపు అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దాడులు, చర్చలు ఏక కాలంలో సాధ్యం కావని సుష్మా అభిప్రాయపడ్డారు.