ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వంపై పలు దేశాల వ్యతిరేఖత

5

సియోల్‌ ,జూన్‌ 23(జనంసాక్షి):ప్రతిష్టాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ లో చేరాలన్న భారత ప్రయత్నం దాదాపు విఫలమైంది. భారత్‌ కు మద్దతిచ్చే విషయంలో కూటమిలో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాలు భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించాయి. దీంతో మొత్తం 48 దేశాల కూటమిలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఐతే, భవిష్యత్‌ లోనైనా ఎన్‌.ఎస్‌.జి లో చేరేందుకు భారత్‌ కృషి చేయనుంది.దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ లో జరిగిన ఎన్‌.ఎస్‌.జి ప్లీనరీ సమావేశంలో భారత్‌ దాఖలు చేసిన సభ్యత్వ బిడ్‌ పై చర్చ జరిగింది. ఐతే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో లేని ఇండియాకు సభ్యత్వం కల్పించటంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధానంగా బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాలు భారత్‌ కు వ్యతిరేకంగా మాట్లాడాయి. దీంతో ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఐతే ఎన్‌.ఎస్‌.జి ప్లీనరీ శుక్రవారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో భారత్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఈ విషయంలో పలు దేశాలను ఒప్పించేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. అమెరికా, స్విట్జర్లాండ్‌, మెక్సికో సహా పలు దేశాధినేతలతో చర్చించి భారత్‌ కు సహకారం అందించేలా కృషి చేశారు. ఐతే, చైనా మాత్రం మొదటి నుంచి ఈ విషయంలో భారత్‌ కు వ్యతిరేకంగా ఉంది. పాకిస్థాన్‌ సైతం చైనా ద్వారా భారత్‌ కు ఎన్‌.ఎస్‌.జి లో సభ్యత్వం దక్కకుండా ప్రయత్నాలు చేసింది.ఐతే, ఉజ్బెకిస్థాన్‌ లో జరిగిన షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొనటానికి వెళ్లిన ప్రధాని మోడీ తాష్కెంట్‌ లో చైనా అధ్యక్షుడు జి జిన్‌ పింగ్‌ తో భేటీ అయ్యారు. ఎన్‌.ఎస్‌.జి విషయంలో మద్దతు కోరుతూనే? పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. చైనా మాత్రం ఎన్‌.ఎస్‌.జి లో భారత్‌ సభ్యత్వానికి నో చెప్పింది.ప్రస్తుతం ఎన్‌.ఎస్‌.జి లో సభ్యత్వం దక్కకపోయినా? మళ్లీ ప్రయత్నం చేయాలని భారత్‌ భావిస్తోంది. భారత్‌ ను వ్యతిరేకించిన దేశాలను ఒప్పించేందుకు కేంద్రం కృషి చేయనుంది.