ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఎందుకు రాలేదు?

1

– మోదీపై రాహుల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): అణు సరఫరాదారుల గ్రూప్‌ (ఎన్‌ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర సర్కార్‌ పై విరుచుకుపడింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరో అడుగు ముందుకేసి..భారత్‌ కు ప్రతిష్టాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌ లో సభ్యత్వం రాకపోవటంపై కాంగ్రెస్‌ వైస్‌ ప్రసిడెంట్‌ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని మోడీ దౌత్యం విఫలమైందంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఎన్‌ఎస్జీలో భారత్‌కు స్వభ్యత్వ నిరాకరణ మోదీ దౌత్య వైఫల్యానికి నిదర్శమని రాహుల్‌ ట్విట్టర్‌ లో విమర్శించారు. ఎన్‌ఎస్జీ విషయంలో నరేంద్రమోదీ జరిపిన సంపద్రింపులు విఫలమయ్యాయని, ఇది దౌత్యపరంగా మోదీ ఫెయిలవ్వడమేనని హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్జీలో స్వభ్యత్వం కోసం భారత్‌ కొన్ని నెలలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ, చివరిక్షణంలో చైనా మోకాలడ్డటంతో ఈ ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే.ప్రధాని మోడీ చాలా దేశాల అధినేతలతో దౌత్యం నడిపినప్పటికీ ఎందుకు ఫలితం రాలేదని ఆయన ప్రశ్నించారు. కావాలనే ఎన్‌.ఎస్‌.జి విషయంలో మోడీ సర్కార్‌ అతిగా వ్యవహరించిందని రాహుల్‌ విమర్శించారు. సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్జీ సదస్సులో అంతర్జాతీయంగా భారత్‌ కు ఇది భంగపాటుగా కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది.