ఎన్‌డిఎలో ప్రణబ్‌కు పెరుగుతున్న సానుకూలత
రాష్ట్రపతి ఎన్నికలు
న్యూఢిల్లీ, జూన్ 16 : రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ దశలో పోటీ వల్ల తమకు ఇరకాట పరిస్థితి ఎదురవుతుందని ఈ ప్రతిపక్ష కూటమిలో ఒక వర్గం వాదిస్తున్నది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలోని ఎన్‌డిఎలో కీలక భాగస్వామ్య పక్షమైన జెడి (యు) వర్గాల సమాచారం ప్రకారం, పార్టీ ముఖర్జీ పట్ల ఏకాభిప్రాయ సాధనకు సుముఖంగా ఉంది. రాష్ట్రపతి పదవికి పోటీ తప్పించడం మంచిదని పార్టీ అభిప్రాయపడుతోంది. పోటీ చేయడానికి మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ ఇంత వరకు అంగీకరించకపోవడం, ఎన్‌డిఎకు తగినంత సంఖ్యా బలం లేకపోవడం ఇందుకు కారణాలు. నరేష్ గుజ్రాల్‌తో సహా శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఎడి) నాయకులతో శనివారం భేటీ అయిన జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌డిఎ ఆదివారం జరిపే సమావేశంలో ఈ విషయమై సమష్టిగా నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి కలామ్ పేరును లాగేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నరేష్ గుజ్రాల్ ఆక్షేపించారు. కలామ్ ఈ పోటీకి తన సమ్మతి తెలియజేయనందున ఈ విధమైన ప్రయత్నాలు ఆయనను ‘కించపరచడమే అవుతాయి’ అని గుజ్రాల్ అన్నారు. ‘తాను పోటీ చేస్తానని కలామ్ చెప్పనప్పుడు ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తారెందుకు? కలామ్ పేరును పదే పదే ప్రస్తావించడం ద్వారా మనం ఆయనను కించపరుస్తున్నాం’ అని గుజ్రాల్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాజీ రాష్ట్రపతి కలామ్ అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నందున ఆయన అభ్యర్థిత్వానికి అకాలీ దళ్ మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నకు తాను పోటీ చేస్తున్నానని కలామ్ చెప్పిన తరువాతే తమ పార్టీ స్పందిస్తుందని గుజ్రాల్ సమాధానం ఇచ్చారు. ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌ను ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎన్‌డిఎ నిలబెట్టాలనే ఆసక్తితో ఎస్‌ఎడి ఉందని కొన్ని వర్గాలు సూచిస్తున్నప్పటికీ, అటువంటి ఆలోచనే లేదని గుజ్రాల్ స్పష్టం చేశారు. ‘బాదల్ తన ప్రస్తుత పదవితో సంతుష్టి చెందారు. ఆయన పంజాబ్‌లో ఉన్నారు. ఆయన ఆనందంగా ఉన్నారు. (ఉప రాష్ట్రపతి పదవికి) ఆయన పేరును ప్రతిపాదించే స్థితిలో మేము లేం. మాకు సంఖ్యా బలం లేనప్పుడు అలా చేస్తే మమ్మల్ని మేమే కించపరుచుకున్నట్లు అవుతుంది’ అని గుజ్రాల్ అన్నారు. అయినా, ప్రతిపక్షం మాటకు ‘విలువ ఇచ్చేందుకు’ యుపిఎ ఎన్నడూ ప్రయత్నించలేదని, రాష్ట్రపతి ఎన్నిక అంశంపై ఏకాభిప్రాయ సాధనకు పూనుకోలేదని గుజ్రాల్ ఆరోపించారు.