ఎన్‌యూ ఆచార్యుడి ఇంట్లో భారీ చోరీ
రూ.5లక్షల నగదు, బంగారుహారం చోరీ
చోరీ ప్రాంతాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ విజరావు
కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గుంటూరు, జూన్20(జనం సాక్షి) : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కు విల్లాలో భారీ చోరీజరిగింది. ప్లాట్ నెం.197లో నివాసం ఉంటున్న ఏఎన్‌యూ ఆచార్యులు సుధాకర్ ఇంట్లో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 5లక్షల నగదు, బంగారు హారం, లక్ష విలువైన వాచీ చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ విజయారావు, క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలంలో దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత దుండగులు ప్రహరి గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. విల్లాలో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు నివాసం ఉంటున్నారు. ప్రముఖులు బస చేసే ప్రాంతంలో జరిగిన చోరీ జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. విల్లా ప్రహారీ గోడకు రక్షణగా విద్యుత్ తీగలున్నా అవి పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది మరమ్మతుల కోసం రెండు రోజుల నుంచి విద్యుత్ తీగలకు సరఫరా నిలిపివేసినట్లు పోలీసులకు వెల్లడించారు. దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు.