ఎపిలో దూకుడు పెంచిన బిజెపి

వైకాపా లక్ష్యంగా ప్రజావ్యతిరేక విధానాలపై గురి

పార్టీని బలోపేతం చేసుకునే విధంగా కార్యక్రమాలు

విజయవాడ,నవంబర్‌21  (జనం సాక్షి) : ఎపిలో బిజెపి దూకుడు పెంచింది. అధికార వైకాపా లక్ష్యంగా విమర్శలు, కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకి ముందు ఏపీలో బీజేపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనీ, బీజేపీ కేంద్ర పెద్దల సహకారంతోనే వైసీపీ ఎన్నికల్లో పోటీచేసిందనీ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకున్న వైసీపీ.. ఆ తర్వాత రాష్ట్రంలో పాలనపగ్గాలు చేపట్టింది. అయితే.. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆరు నెలలు తిరగకుండానే రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. రాజధాని నిర్మాణం నిలిపివేత, పోలవరం సహా, ఇతర ప్రాజెక్టుల విషయంలో రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లడం వంటి పరిణామాలు రాజకీయవర్గాలతోపాటు ప్రజలను కూడా నిశ్చేష్టులను చేశాయి. కొన్ని నిర్ణయాల విషయంలో కేంద్ర పెద్దల సూచనల్ని కూడా జగన్‌ ఖాతరుచేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం పతాకస్థాయికి చేరింది. గ్రామ వాలంటీర్లగా వైసీపీ కార్యకర్తలను నియమించటం వంటి అంశాలపై విపక్షాలు గట్టిగానే విరుచుకుపడ్డాయి. తాజాగా ఆంధప్రదేశ్‌లో ఇంగ్లీష్‌ విూడియాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ కలకలానికి దారితీసింది. రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావటమే బిజెపి మనముందున్న లక్ష్యం. కేందప్రభుత్వ పథకాలను, మోదీ పట్ల ఉన్న క్రేజ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బలపడాలని చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ధ్యేయమని నేతలు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ అంతిమంగా అధికారంలోకి వస్తేనే కదా వారు ఏమైనా చేయగలిగేది? ఇదిలా ఉంటే.. అటు కేంద్రంతో పాటు ఇటు దేశంలోని అనేక రాష్టాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. ఇదే స్పీడుతో తెలుగు రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతాపార్టీకి చెందిన ఏపీ ముఖ్యనేతలు వైకాపా లక్ష్యంగా విమర్శలకు సిద్దం అయ్యారు. ప్రజావ్యతిరేక విధానాలను తీసుకుంటే ఏమాత్రం ఉపేక్షించవద్దన్న పెద్దల సలహాతో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇసుక సంక్షోభం, రాజధాని, పోలవరం వ్యవహారాలపై జాతీయ విూడియాలో కూడా విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావటమే ముందున్న లక్ష్యం. అందుకే ఏపీలో ఇసుక కొరతపై, భవన నిర్మాణరంగ కార్మికుల కష్టాలపై పోరాటం సాగిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఎక్కడా తగ్గడంలేదు. బీజేపీ తన వాయిస్‌ బాగా పెంచింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు కొన్నింటిపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మతపరమైన వ్యవహారాలను వారు ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న తీరు ప్రజల్లోకి బలంగానే వెళ్తోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేందప్రభుత్వం గమనిస్తోందనీ.. ఇక్కడి పరిణామాలపై క్షణక్షణం సమాచారం అక్కడికి చేరుతోందని కూడా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.