ఎపిలో స్తబ్దుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు

అంటీముట్టనట్లుగా నేతల వ్యవహారం

విజయవాడ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఎపి కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస పార్టీ అంతా ఖాళీ అవుతున్నా పట్టించుకోవడంలేదు. కార్యకర్తలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కడపజిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సి.రామచంద్రయ్య వైకాపాలో చేరడంతో వాణి వినిపించేవారు కరువయ్యారు. తులసిరెడ్డి వంటి నేతలు ఇప్పుడిప్పుడే క్రీయాశీలక పాత్రలోకి రంగప్రవేశం చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఎపిలో స్తబ్దుగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. గతంలో స్వతహాగా కార్యక్రమాలు చేస్తూ జిల్లాల్లో పర్యటించిన ఆయన కూడా తెరమరుగయ్యారు.మాజీ మంత్రి, పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్‌ సైతం పార్టీ కార్యక్రమాలలో అనుకొన్నమేర ఉత్సాహంతో పాల్గొనడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.పశ్చిమ గోదావరి నుంచి వట్టి వసంత్‌కుమార్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పళ్లం రాజు వంటి నేతలు కూడా అప్పుడప్పుడే కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేసినా అది కూడా ఇప్పుడు కానరావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కొందరు పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతున్నా ఇంకా కొంతమంది సీని యర్లు దూకుడు పెంచాల్సిన అవసరముందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అనేకులు ఉన్నా పార్టీ బలోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మౌనంగా ఉండిపోతున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు వాసోతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌నేత టి.సుబ్బిరామిరెడ్డి కేవలం రాజ్యసభకే పరిమితంఅయ్యారు. మిగతా నేతు కూడా పార్టీ బలోపేతం కోసం దృష్టి సారించడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్న సీనియర్‌ నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ బలోపేతం దిశగా దృష్టిసారిం చకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.