ఎపి సర్కార్‌ మెడకు ఇసుక కొరత

ఉధృతం అవుతున్న ఆందోళనలు
అమరావతి,అక్టోబర్‌29(జనంసాక్షి,) : ఆంధ్ర రాష్ట్రంలో  ఇప్పుడు ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇసుక దొరక్క నిర్మాణాలు ఆగిపోవడం, కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం, మరికొందరు అందుకు ప్రయత్నించడం తీవ్రంగా కలచి వేస్తోంది. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అనేక ఇబ్బందులకు కారణమైందన్న విమర్శలు వస్తున్నాయి.  గత టిడిపి సర్కారు హయాంలో పాగా వేసిన మాఫియాను తొలగించి తక్కువ ధరకు ప్రజలకు ఇసుక సరఫరాకంటూ వైసిపి తీసుకొచ్చిన కొత్త విధానం మరిన్ని కొత్త సమస్యలకు తెరతీసింది. నాలుగు మాసాలకుపైగా ఇసుక సరఫరా లేక భవన నిర్మాణ రంగం స్తంభించి పోయింది. లక్షలాది కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారు. జీవనోపాధి కొరవడి బతుకు సాగించలేక నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకు రైతులు, కౌలు రైతుల బలవన్మరణాలనే చూశాం. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అదే దారి పట్టడం ఆ రంగంలో సంక్షోభానికి ప్రమాద ఘంటికను సూచిస్తోంది. నదులు, సముద్రాలు,కాలువులు విపరీతంగ ఆఉన్న ఎపిలో ఇసుక కొరత తీవ్రంగా కలచివేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల మూలంగా ఏర్పడ్డ ఇసుక కొరత స్థానిక భవన నిర్మాణ రంగానికి గోరుచుట్టుపై రోకలి పోటులా తయారైంది. ఇసుక కొరత ఎంత తీవ్రంగా ఉందో మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన సవిూక్షా సమావేశమే సాక్ష్యం. రోజుకు సగటున 85 వేల టన్నులు అవసరంకాగా 45 వేల టన్నులే అందుబాటులో ఉంది. చాలా రోజులు రోజుకు 5 వేల టన్నులనే స్టాక్‌ యార్డులకు ఎపిఎండిసి సరఫరా చేయగలిగింది. సర్కారీ లెక్కల్లోనే ఇంత వ్యత్యాసం ఉంటే వాస్తవ పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉన్నాయో ఊహించవచ్చు. సమస్యను గమనించే, ఏర్లు, వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలకు తాత్కాలికంగా గ్రామ సచివాలయాల్లో పర్మిషన్లు ఇచ్చేలా హడావుడిగా ఆదేశాలొచ్చాయి. ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలున్నప్పటికీ, ప్రధాన నదులన్నింటిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఇసుక వెలికి తీత కుదరట్లేదంటోంది సర్కారు. ఇసుక కొరతకు ఇదొక కారణం తప్ప
మొత్తానికీ ఇదే సమస్య కాదు. ఎప్పుడైనా ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టదల్చినప్పుడు పర్యవసానాలను, ప్రత్యామ్నాయాలను ముందే ఆలోచించాలి. రాజధాని అమరావతిపై సర్కారీ పెద్దలు రోజుకో తీరుగా మాట్లాడుతుండటంతో రియల్‌, నిర్మాణ వ్యవస్థలు అయోమయాన్ని ఎదుర్కొంటున్నాయి. అందుకు తోడు గతంలో ప్రతిపాదించిన, చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టు పనులు సైతం అర్ధంతరంగా నిలిచి పోయాయి. ఈ ప్రభావం నిర్మాణ, దాని అనుబంధ లక్షలాది కార్మికులకు జీవన్మరణ సమస్యగా పరిణ మించింది.  కొత్త విధానం వచ్చి నెలలు దాటినా ఇసుక కొరత తీరలేదు సరికదా తీవ్రమైంది. ఇసుక తవ్వకాలు, సరఫరా బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి)కు అప్పగించి, టన్ను ఇసుక రూ.375గా నిర్ణయించింది. కొత్త పాలసీ తెచ్చింది ధరలు పెంచడానికో తగ్గించడానికో అర్థం కాదు. ఆ రేటు పెట్టినా ఇసుక లేదు. ఇసుక కొరత కేవలం భవన నిర్మాణ కార్మికులకే పరిమితం కాదు. దానిపై ఆధారపడ్డ ఉప రంగాలైన కార్పెంటర్లు, పెయింటర్లు, రాడ్‌బెండింగ్‌, గ్రానైట్‌, ఎలక్టిక్రల్‌, ప్లంబింగ్‌, ఇత్యాది లక్షల కార్మికుల జీవనోపాధిపై దెబ్బ పడుతుంది. ఇసుక సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకొన్నాయి.