ఎఫ్‌డిఐలపై లోక్‌సభలో వాడి వేడిగా చర్చ

ఎఫ్‌డిఐలపై అనుమతులను వెనక్కి తీసుకోండి : సుష్మా

సుష్మా ప్రసంగాన్ని  అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు

లోక్‌సభలో వాడి వేడిగా చర్చ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డిఐ) అనుమతిస్తూ ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని వెంటనే ఉపసంహకరించుకోవాలని లోక్‌సభలో బిజెపి పక్ష నేత సుష్మాస్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఎఫ్‌డిఐల అనుమతి విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినతర్వాతే ఎఫ్‌డిఐలపై నిర్ణయం తీసుకుంటామన్న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఆ తర్వాత మాట తప్పారని ఆమె విమర్శించారు. మంగళవారంనాడు లోక్‌సభలో ఎఫ్‌డిఐలపై చర్చ ప్రారంభమైంది. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సుష్మాస్వరాజ్‌ చర్చను ప్రారంభించారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఎఫ్‌డిఐల ప్రవేశంతో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని అన్నారు. ఎఫ్‌డిఐల వల్ల రైతులకు మంచి ధర వస్తుందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ నిర్ణయం వల్ల రైతాంగం కుప్పకూలుతుందన్నారు. లాభాల విషయంలో పెద్ద సంస్థలు రాజీపడబోవని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా వ్యాపారంలో పోటీ ఉండాలే తప్ప గుత్తాధిపత్యం ఉండరాదన్నారు. పలు దేశాలలో రిటైల్‌ రంగంలో భారీ సంస్థలు విఫలమయ్యాయని చెప్పారు. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డిఐలు ప్రవేశిస్తే దేశప్రజలు ఇక బంగాళ దుంపలు కూడా విదేశాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నిర్ణయాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. ఎఫ్‌డిఐల బిల్లును యూపిఏ మిత్రపక్షాలు, అన్ని ప్రతిపక్షాలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆమె చెప్పారు.

షాపింగ్‌ మాల్స్‌ వల్ల నగరాలు కళకళలాడినా, భారతీయ చిన్న పరిశ్రమలు అంధకారంలో కూరుకుపోతాయన్నారు. లోవాలో వాల్‌మార్ట్‌ ప్రవేశించడంతో 84 శాతం ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా చిన్న దుకాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆమె చెప్పారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐల అనుమతి వల్ల ఉత్పత్తి రంగంలో భారీ ఎత్తున నిరుద్యోగం ఏర్పడుతుందన్నారు. ఉత్పత్తులన్నీ చైనా నుంచే దిగుమతి అవుతయన్నారు. ఎఫ్‌డిఐలను అనుమతించేందుకు వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు లంచాలిస్తున్నాయని ఆరోపించారు. ఎఫ్‌డిఐలవల్ల ఉపాధి పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన పోరపాటన్నారు. తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. 40లక్షల మంది ప్రజలకు ప్రత్యక్ష ఉపాధితో పాటు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. తమవద్దనున్న వాల్‌మార్ట్‌కు సంబందించిన సమాచారం మేరకు ఒక్కొక్క వాల్‌మార్ట్‌ స్టోర్‌లో అత్యధికంగా 214మంది ఉద్యోగుల మాత్రమే ఉంటారని తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదిక ప్రశ్నార్ధకమని అన్నారు.

ఎఫ్‌డిఐల పై చర్చ సందర్బంగా సుష్మస్వరాజ్‌ చెరకు రైతుల గురించి ప్రస్తావించినప్పుడు సభలో పెద్ద గందరగోళం చెలరేగింది. దళారీల వ్యవస్థను తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే చక్కటి పరిశ్రమలో ఎంతో మంది దళారులు ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది రైతులు అవస్థలు పడుతున్నారు. వారిని పట్టించుకున్ననాథుడు లేడు అని సుష్మా అన్నారు.

సభలో గందరగోళం

ఎఫ్‌ఢిఐల అనుమతిపై బిజెపి పక్ష నేత సుష్మాస్వరాజ్‌ ప్రభుత్వ నిర్ణయం పై నిప్పులు చెరుగుతుండగా అధికార పక్ష కాంగ్రెస్‌ సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. సుష్మా ప్రసంగం ప్రారంభంలో  పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను బిజెపి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. బిజెపి, వామపక్షాలు ఓటింగ్‌కు భయపడి పారిపోతున్నాయని కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి సీనియర్‌ నేత యస్వంత్‌ సిన్హా మాట్లాడుత ఓటింగ్‌ నిర్వహిస్తే ఎవరు ఏంటో తేలిపోతుందని కదా అని అన్నారు. మరో ప్రతిపక్ష నేత గురుదాస్‌ దాస్‌గుప్తా తాము ఓటింగ్‌ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు.