ఎఫ్‌డీఐపై సర్కారు మొండివైఖరి : బీజేపీ
న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ అంశంలో విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించి పార్లమెంటు సజావుగా నడిచేలా చూడాలని సర్కారు మొండివైఖరి వీడాలని ప్రతిపక్ష బారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది. ఈ అంశంలో ఓటింగుకు అవకాశమున్న నిబంధన కిందే సభలో చర్చ కోసమే తాము నిలబడతామని స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఎఫ్‌డీఐపై సంబంధిత వర్గాలతో చర్చించి ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ఆ హామీని వదిలేసిందని బీజేపీ అదికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు. ఓటింగ్ ఆధారిత చర్చ జరిగినప్పుడు సభ మనోభావాలు తెలుస్తాయని, ఈ విషయంలో ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని పేర్కొన్నారు. ఎఫ్‌డీఐపై ఓటింగ్ ఆధారిత చర్చకు సమ్మతించకపోవడం ద్వారా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొనడానికి ప్రభుత్వమే కారణమని హుస్సేన్ మండిపడ్డారు. 184వ నిబంధన ప్రకారం మాత్రమే చర్చ జరగాలని బీజేపీ, ఎన్డీయేలు కోరుకుంటున్నాయని, ఈ విషయంలో మార్పు లేదని నొక్కిచెప్పారు. ప్రధాన ప్రతిపక్షం పెట్టిన డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చే వరకూ బీజేపీ, దాని మిత్ర పక్షాలు పార్లమెంటును నడవనీయవని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక భారత్‌లో దుకాణాలు తెరిచేందుకు వాల్‌మార్ట్ వ్యాపారసంస్థ నుంచి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు, గంగానది కాలుష్యంపై పోరాటం దిశగా అనిరళ్ గంగ ప్రాజెక్టు తదితర అంశాలను బీజేపీ సమావేశంలో చర్చించారు.