ఎఫ్‌.డి.ఐలపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు నినాదాలతో దద్దరిల్లిన సభ లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూడిల్లీ:ఎంతో కీలకమైన విదేశీ పెట్టుబడులపై లోక్‌సభలో ఖచ్చితంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు గురువారంనాడు గట్టిగా పట్టుపట్టాయి.ఈ అంశంపై ప్రతిక్షాల సభ్యులు గట్టిగా నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం అంటున్నదీ వినబడనేదు.రకరకాల నినాదాలతో సభ దద్దరిల్లింది.

సభలో ప్రశాంతంగా ఉండాలని కోరుతూ స్పీకర్‌ మీరాకుమార్‌ ముందు 12 గంటలవరకు సభను వాయిదా వేశారు.అనంతరం సమావేశమైన సభలో మళ్లీ అదే పరిస్థితి కనిపించింది.సభను మళ్లీ 12.30 గంటలకు వరకు వాయిదా వేశారు.మళ్లీ సభ ప్రారంభమయ్యేసరికి తృణమూల్‌ కాంగ్రెస్‌ సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టారు.ఇందుకు ఎంతమంది సభ్యులు మద్దతు ఇస్తున్నారని ఒకవైపు స్పీకర్‌ సభను ఉద్దేశించి అడుగుతున్నా మిగిలిన ప్రతిపక్షాల సభ్యులు మాత్రం ఎఫ్‌.డి.ఐ లపై చర్చకోసం నినాదాలు చేస్తూనే ఉన్నారు.

సభలో అప్పటికే ఐస్‌ల్యాండ్‌ నుంచి వచ్చిన పార్లమెంటు ప్రతినిది వర్గం కూడా భారత పార్లమెంటు సంప్రదాయాలను సన్నిహితంగా పరిశీలించడానికి విచ్చేశారు.వారంతా సభకు విచ్చేసినప్పుడు స్పీకర్‌ వారిని సభకు పరిచయం చేశారు.వారు గ్యాలరీలో లేచి నిల్చుని సభకు అభివాధం చేశారు.సభ్యులు కూడా అప్పుడు కరతాళ ద్వనులతో వారికి హార్థిక స్వాగతం పలికారు.

సభ నినాదాలతో దద్దరిల్లుతున్నప్పుడు స్పీకర్‌ మీరాకుమార్‌ ఫ్లీజ్‌,ఫ్లీజ్‌ అంటూ అనేక సార్లు నవ్వుతూ సభ్యులను ప్రశాంతంగా ఉండవలసిందిగా  కోరారు.అతిథులను దృష్టిలో ఉంచుకుని ఇది పద్దతిని కాదని కూడా స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా సభలో ప్రశాంత వాతవరణం ఏర్పడలేదు.తృణమూల్‌ కాగ్రెస్‌ చేసిన తీర్మానం ప్రతిపాదనకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆ ప్రతిపాదన త్రోసిపుచ్చిన స్పీకర్‌ మీరాకుమార్‌ సభను తిరిగి మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా వేశారు.రెండు గంటలకు మళ్లీ సమావేశమైన లోక్‌సభలో ఎఫ్‌.డి.ఐ.లపై పరిస్థితి ఇంకా అననుకూలంగా ఉండడంతో స్పీకర్‌ చివరికి సభను రేపటికి వాయిదా వేశారు.