ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణ స్వీకారం
– ప్రమాణం చేయించిన స్పీకర్ పోచారం
హైదరాబాద్, జనవరి19(జనంసాక్షి) : బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం విూడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. అందుకే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న ముంతాజ్‌ఖాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం ఇష్టం లేకనే ఆరోజు ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి హాజరు కాలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రొటెస్ట్ స్పీకర్‌గా ముంతాజ్ ఖాన్‌ను నియమించడం పట్ల ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెట్టకుండా వారు లేవనెత్తే సమస్యలను పరిష్కారమయ్యే దిశగా అసెంబ్లీ అధికార పార్టీ కృషి చేయాలని కోరారు. అలా కాకుండా ఏకపక్షంగా అసెంబ్లీ నిర్వహిస్తే ప్రతిఘటిస్తామని, సామరస్యంగా అందరినీ కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటానని, హిందూధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని రాజాసింగ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.