ఎమ్మెల్యేలకు డబుల్ టెన్షన్
అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు జన సవిూకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సవిూకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజేసి నట్లయ్యింది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని, రాని వారికి ప్రత్యామ్నాయ పదవులు కేటాయిస్తామని స్పష్టత ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల టెన్షన్ పెరిగింది. ఈ సంకేతాలు ఒక రకంగా టిక్కెట్ల రేసులో ఉన్న ఆశావహుల్లో ఆశలు రేకెత్తించి నట్లయింది. ముందుగా జనసవిూకరణతో అధినేతను మెప్పించాలి. సభ తరవాత టిక్కట్ వస్తుందో రాదో అన్న బెంగలో మరింత టెన్షన్ పెరుగుతోంది. ఉన్నవారిలో ఎందరికి టిక్కెట్లు వస్తాయో రావో తెలియదు. ఐదారుగురికి మాత్రం రావని స్వయంగా సిఎం కెసిఆర్ అంటున్నా దాదాపు సగం మందికి టెన్షన్ తప్పడం లేదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా గత ఫలితాలనే పునరావృతం చేయాలని అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆరునెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం విూద పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఉత్సాహాన్ని నింపగా, ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ మొదలైందనే చర్చ సాగుతోంది.దీంతో టీఆర్‌ఎస్ శాసనసభ్యుల గుండెల్లో గుబులు మొదలైంది.. సిట్టింగ్‌లకే సీట్లిస్తామన్న సీఎం కేసీఆర్.. ఒకటి, రెండు చోట్ల మార్పులు తప్పవని చేసిన ప్రకటన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది.ఒకటి,రెండు మార్పులు అన్న అంశంపైనే ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరి సీట్లు గల్లంతవుతాయి.. ఎవరికి టికెట్లు దక్కుతాయనే అంశంపైనే ప్రధాన చర్చ నడుస్తోంది. ఈ రకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఒకింత ఆందోళన నెలకొంది. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించడం వారిలో సంతోషం నింపగా.. ఒకటి, రెండు మార్పులుంటాయని ఆయన కుండబద్దలు కొట్టడం శాసన సభ్యులను కలవరపెడుతోంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పేర్కొన్న కేసీఆర్.. మరోవైపు ఒకటీ రెండు చోట్ల మార్పులుం టాయనే సంకేతాలివ్వడం తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వంపై ఎక్కడో ఒకింత అభద్రతా భావంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మార్పు చేయాలని భావిస్తున్న సీట్లలో తమ నియోజకవర్గాలేమైనా ఉంటాయా..? అనే అంశంపై పార్టీలో విశ్లేషణ సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో కేశవరావు నేతృత్వంలోని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఎప్పటికప్పుడు తెప్పించుకునే నివేదికలు కూడా కీలకమని కేసీఆర్ పేర్కొన్నారు. దీంతో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు అంటూనే ఎంపిక కమిటీని నియమించడంతో కొందరు ఎమ్మెల్యేలకు అంతర్గతంగా టెన్షన్ పట్టుకుంది. ఈ దశలో ఇప్పుడు ప్రగతి నివేదన సభకు జన సవిూకరణ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. వచ్చే నెలలోనే ఆయా నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తామని అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో.. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులను తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించేలా జన సవిూకరణ చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల జోన్‌లోకి వచ్చేశామని, రేపేఎన్నికలు అనుకుని సమాయత్తం కావాలి.. అని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడిని రాజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్పు చేయాల్సిన వారిలో జిల్లాల్లో ఏయే నియోజకవర్గం ఉంటుంది.. అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు మారుతారన్న దనాఇకి లెక్కలన్నీ కెసిఆర్‌కు మా/-తరమే తెలుసు. వందకు తగ్గకుండా సీట్లు గెలుస్తామని ప్రకటించినా ఉన్న వారిలో ఎందరు మైనస్ అవుతారన్నది ప్రగతి నివేదన సభ తరవాతనే మెల్లమెల్లగా అనుభవం లోకి రానుంది. ఈలోగా సభ ఏర్పాట్లే ఇప్పుడు ప్రధానం కానున్నాయి. జాతీయ రాజకీయ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించేలా సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ శివారులో ప్రగతి నివేదన భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. లారీలు, అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాల్లో తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రాక్టర్లలో తరలివెళ్లే వారు ఒక రోజు ముందుగానే కొంగరకు చేరుకోవాలని భావిస్తున్నారు.ప్రగతి నివేదన సభకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి అందింది. అద్దె బస్సులతో సహా.. అన్ని బస్సులను కూడా ఈ సభకు తీసుకెళ్లాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
—————–