ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు ఘన స్వాగతం
– గొల్లపల్లి నుంచి మంథని వరకు బారీ బైక్ ర్యాలీ
– మంగళ హరతులు, గజమాలలతో ఘన స్వాగతాలు
– పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
జనంసాక్షి , మంథని : రెండు రోజుల క్రితం మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పుట్ట మధూకర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపధ్యంలో మంథనికి వస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌కు స్వాగతం పలికేందుకు గులాబీదండు కదిలింది. అడుగడుగుగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పుట్ట మధూకర్‌కు నీరజనాలు పలికారు. బుధవారం పుట్ట మధూకర్ మంథనికి వస్తున్న క్రమంలో నియోజకవర్గ సరిహద్దు ప్రాంతమైన కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. గొల్లపల్లి నుంచి మంథని వరకు బారీ బైక్ ర్యాలీతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనను స్వాగతించారు. గొల్లపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీతో కలిసి ఆయన ప్రత్యేక వాహనంలో ర్యాలీగా బయలు దేరారు. గొల్లపల్లి వద్ద స్వాగతం పలుకగా కమాన్ పూర్, కల్వచర్ల, రాజాపూర్, సెంటనరీ కాలనీ, బేగంపేట్, లద్నాపూర్, పుట్టపాక, శ్రీరాంనగర్, కూచిరాజ్‌పల్లి, గంగాపురి గ్రామాల వద్ద మహిళలు మంగళహరతులతో స్వాగతం పలుకుతూ శాలువాలతో సత్కరించారు.అదే విధంగా అభిమానులు గజమాలలు వేసి స్వాగతించారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని మహనీయుల విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీ సందర్బంగా మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడాయి. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి జాబితాలో ప్రకటించడంతో అభిమానులు, కార్యకర్తలో ఉత్సాహం రెట్టింపైంది. ఈ క్రమంలో పుట్ట మధూకర్‌కు ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, మహదేవ్‌పూర్, మహముత్తారం, కాటారం, మల్హర్, పలిమెల మండలాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. డీజే సౌండ్స్‌తో నృత్యాలు చేస్తూ మంథని వరకు ర్యాలీని కొనసాగించారు.