ఎమ్మెల్యే నరేందర్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి
వరంగల్ బ్యూరో, అక్టోబర్ 28 (జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తాను ఒక ప్రజా ప్రతినిధి అని మరిచిపోయి జక్కలొద్దలో గుడిసె వాసులపై దాడులు చేయించడం అమానుషమైన చర్య అని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. ఈ మేరకు శనివారం వరంగల్ లోని ఉరుసు గుట్ట వద్ద గల సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ గుడిశవాసులు తమ గుడిసెలకు పెట్టుకున్న సిపిఎం జండాలని పీకేయించి గులాబీ జెండాలను బలవంతంగా పెట్టించడంతోపాటు సాగర్ తో పాటు అతని భార్యపై దాడులు చేసి గాయపరచడం అమానుషమైన చర్య అన్నారు. ఓట్ల కోసం ఎమ్మెల్యే నరేందర్ దాడులు చేయించాడని చెప్పారు. ఎన్నికల అప్పుడే ఎమ్మెల్యేకు గుడిసె వాసులు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. స్వార్ధ రాజకీయాలతో రౌడీయిజంతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. 19 జిల్లాల్లో గుడిసవాసులు తమ గుడిసెల కోసం పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని వీరయ్య చెప్పారు. వాళ్ళందరికీ గుడిసెలు పట్టాలు వచ్చే దాకా పోరాటం ఆగదు అన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే నరేందర్ తో పాటు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా గుడిసె వాసులపై దాడులు చేయించడం సరైనది కాదన్నారు. జొక్కలోది గుడిసవాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎర్రజెండా పేద ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే భూకబ్జాకోరులకు అండగా ఉంటున్నారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రంలో బిఆర్ఎస్ కు భారీ నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు సరైన తీర్పు చెబుతారని ఎస్. వీరయ్య హెచ్చరించారు. మరో కార్యదర్శి వర్గ సభ్యుడు జి. నాగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే నరేందర్ పద్ధతి సరిగా లేదని పేదల గుడిసెలు వేసుకుంటే గొడవలు సృష్టించి లబ్ధి పొందాలనుకోవడం సరైనది కాదని అన్నారు. ప్రజలు సరైన తీర్పునే ఇస్తారని వివరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సింగారపు బాబు నలిగంటి రత్నమాల కోరబోయిన కుమారస్వామి ఈసంపల్లి బాబు ముఖ్యర రామస్వామి భూక్య సమ్మయ్య పాల్గొన్నారు.