ఎమ్మెల్యే పార్థసారధి దీక్షకు పోలీసులు నిరాకరణ 

– ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు..
– పోలీసులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట
– బందర్‌ రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం
– చంద్రబాబుది దొంగదీక్ష అన్న పార్థసారధి
విజయవాడ, నవంబర్‌14 (జనంసాక్షి)  : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్షకు పోటీగా
వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్‌ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్‌ దగ్గర చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సైతం దీక్షకు సిద్ధమయ్యారు. చంద్రబాబు దీక్షకి పోటీగా దీక్ష చేస్తానని ప్రకటించారు. ధర్న చౌక్‌ సవిూపంలోనే దీక్షకు కూర్చుంటానని చెప్పారు. పోలీసులు పర్మిషన్‌ లేదని చెప్పినా ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోలేదు. దీక్షకు బయలుదేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. పార్థసారథి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా అంటూ నిలదీశారు. ఇసుక పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఇసుక పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని పార్థసారథి స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఇసుక దొంగలు ఉండేవారని, ఇప్పుడు లేరన్నారు. ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకు పోతోందని ఆరోపించారు. చంద్రబాబుకు మతిపోయి దీక్షలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు.