ఎమ్మెల్యే శ్మశాన నిద్రతో కదిలిన యంత్రాంగం
ఏలూరు ,జూన్23(జనం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశాన నిద్రతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే శ్మశాన పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. శ్మశాన పనులు ఆగిపోవడంతో ఎమ్మెల్యే వినూత్న ఆలోచన చేశారు. ఆ ఆలోచనను స్మశానంలో అమలు చేశారు. రాత్రి అక్కడే టిఫిన్ తిన్నారు. అక్కడే మంచంపై నిద్రించారు. ఎమ్మెల్యే దృఢనిశ్చయంతో రాత్రంతా సశ్మానంలో బస చేయడానికి కారణం లేకపోలేదు. పాలకొల్లు స్మశానవాటికకు ఏడాది క్రితం రూ. 3 కోట్లనిధులు కేటాయించారు. కానీ స్మశానవాటిక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.స్మశానవాటిక నిర్మాణ పనులు జరుగకపోవడానికి కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలే. దీంతో అందరిలో భయాన్ని పొగొట్టేందుకు నిద్రకు ఉపక్రమించారు ఎమ్మెల్యే. ఈ విషయం తెలియగానే అధికారులు ఉరుకులుపరుగులు పెట్టారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయడానికి ఓ కదలిక వచ్చింది. రాత్రంతా స్మశానంలో జాగారం చేసిన ఎమ్మెల్యే ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత కప్పు కాఫీ తాగుతూ దినపత్రికలు చదివారు. అధికారులతో చర్చించారు. ఇంతకాలం స్మశానవాటిక అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని అధికారులు కార్మికులను వెంటపెట్టుకుని వచ్చారు.