ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు పూర్తి
` గవర్నర్ కోటాలోనే కోదండరాం
` తుది దశకు చేరుకున్న కసరత్తు
` నామినేటెడ్ పదవుల భర్తీ అంశమూ కొలిక్కి
హైదరాబాద్, జనవరి 14 (జనంసాక్షి)
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తుదిదశకు చేరింది. పేర్లు ఖరారు చేసేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి వెళ్లగా.. గవర్నర్ కోట కింద రెండు, ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు చేసినట్టు తెలిసింది. నాలుగు ఎమ్మెల్సీల్లో గవర్నర్ కోటాలో ఒకటి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంకు, మిగిలిన మూడు బీసీ, మైనార్టీ, ఓసీకి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.రేవంత్, దీపా దాస్ మున్షీ, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇన్‌ఛార్జి కార్యదర్శులు ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీప దాస్‌మున్షి, సునీల్ కొనుగోలు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించిన ఈ ముగ్గురు నిర్ణయానికి వచ్చిన పేర్లపై తాజాగా కేసీ వేణుగోపాల్‌తో సమాలోచనలు చేసినట్టు తెలిసింది. నేడో లేదా రేపో తుదిజాబితాపై అధిష్ఠానంతో ఆమోదముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎంపిక పూర్తి కాగానే ఈ నెల 18 లోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. శాసనసభలో ఉన్న బలాబలాలను పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటా రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో 30 నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు కూడా కాంగ్రెస్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే సీఎం విదేశీ పర్యటన తర్వాతే నామినేటెడ్ పోస్టులపై ప్రకటన రానుంది.