ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

4

– భన్వల్‌లాల్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): తెలంగాణలో ఆదివారం జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో 6 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు, ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందని భన్వర్‌లాల్‌ అన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌  వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటుచేస్తున్నామని, సెల్‌ఫోన్లను గానీ, కెమెరాలను గానీ పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఈ ఎన్నికలకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో, ఆయన విూడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్‌ జరగనుంది. నాలుగు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు 771 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1260 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఖమ్మంలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,110 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు భారీగా ఏర్పాట్లు

ఆదివారం జరిగే స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి నూతనంగా బ్యాలెట్‌ పేపర్‌తో పాటు అభ్యర్థుల ఫొటోలను కూడా ప్రింట్‌ చేశారు. ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను కూడా పంపిణీ చేశారు. కౌన్సిలర్లకు మున్సిపల్‌ కమిషనర్‌, జడ్పీటీసీలకు జడ్పీ సీఈఓ, ఎంపీటీసీలకు ఎంపీడీఓలు గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాలో ఈ నెల27న జరుగనున్న స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు జిల్లా యంత్రాంగం 5 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నల్లగొండ డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో, మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు ప్రభుత్వ బకరవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, దేవరకొండ డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు ప్రభుత్వ మండల పరిషత్‌ కార్యాలయంలో, సూర్యాపేట డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు ప్రభుత్వ మండల పరిషత్‌ కార్యాలయంలో, భువనగిరి డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు ప్రభుత్వ మండల పరిషత్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలను వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్‌త్తూ వీడియోగ్రఫీ కూడా చేస్తూ పోలింగ్‌ కేంద్రం లోపల గాకుండా బయట కూడా వీడియో ద్వారా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రెండు వెబ్‌ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు జరిపేందుకు బ్యాలెట్‌ పత్రాల్లో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి రెండు పెద్ద సైజు బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలను సాధారణ ఎన్నికల మాదిరి గాకుండా ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 5 డివిజన్లలో కలిపి అయిదు రూట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ గత నెల 24న అమలులోకి రాగా, ఈ నెల 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో 5 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  నిరాక్షరాస్యులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సహాయకులను కూడా నియమించనుంది.ఓటర్లను గుర్తించేందుకు సంబంధిత అధికారులు ఐడెంటిఫికేషన్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన జరిగినా, ఓటర్లను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినా, బెదిరించిన కూడా ఈ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఎన్నికలను నిర్వహించేందుకు 750 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. 10 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 10 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 20 మంది పోలింగ్‌ అధికారులు , 10 మంది మైక్రో అబ్జర్వర్లు, 5గురు వీడియోగ్రాఫర్లు, 10 మంది వెబ్‌కాస్టింగ్‌, 5గురు సెక్టార్‌ అధికారులతో పాటు పోలీస్‌ సిబ్బందిని నియమించారు. ఈఎన్నికతో పాటు 30న జరుగునున్న కౌంటింగ్‌కు 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు సంబంధించి ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందిని ఎంపిక చేయడం జరుగుతుంది.