ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం
– 30న ఓట్ల లెక్కింపు
– ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
హైదరాబాద్,డిసెంబరు 27(జనంసాక్షి) :స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం నాలుగు జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను 6 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో నాలుగు జిల్లాల్లోని మిగతా 6 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ఈనెల 30న ఓట్ల లెక్కింపు జరుగనుంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లాల్లో 99.7 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం1260 ఓట్లకు గానూ 1257 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణ పేట ఎంపీడీవో ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఐదుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య యాదవ్, నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాల వారీగా ఓట్లు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయిరంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదుగురు అభ్యర్తులు బరిలో నిలిచారు. 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 99.7 శాతం పోలింగ్ నమోదైంది. 771 మంది ఓటర్లు ఉన్నారు. 769 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 99.7 శాతం పోలింగ్ నమోదైంది. 1,260 మంది ఓటర్లు ఉన్నారు. 1257 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికిగాను నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండలో 99 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 1110 ఓటర్లు ఉన్నారు. 1100 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి గాను 19 మంది అభ్యర్థులు పోటీలోకి దిగారు. మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 95.72 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 725 మంది ఓటర్లు ఉన్నారు. 694 మంది ఓటర్లు ఓటు వేశారు. వికారాబాద్ లో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, సరూర్ నగర్ లో ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1110 ఓట్లకు గానూ 1100 ఓట్లు పోలయ్యాయి. 99 శాతం పోలింగ్ నమోదైంది. సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ముగిసింది. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ఆర్డీవో ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 725 ఓట్లకు గానూ 692 ఓట్లు పోలయ్యాయి. 95.72 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెంలో ఎమ్మెల్యేలు జలగం వెంగళ్రావు, కోరం కనకయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు
30న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
ఇవాళ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కోటాలో 6 స్థానాలకు ఇవాళ నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నాలుగు జిల్లాల్లోని 6 స్థానాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని వెల్లడించారు. ఈనెల 30 ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓట్ల బాక్సులను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని తెలిపారు.