ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 25(జనంసాక్షి) :
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. మెదక్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌ శాసన మండలి పట్టభద్రుల, ఉపాధ్యాయల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం నగరం లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం లో జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఉద్యోగి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ కరీంనగర్‌ కేంద్ర పట్టభద్రుల స్థానంనుంచి ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలోనే 33వేల ఓట్లు రావడం పోలైన వాటిలో 51శాతం దాటడంతో స్వామిగౌడ్‌ ఎన్నికైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కరీంనగర్‌ ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోటీ పెట్టేందుకు ఏఒక్క పార్టీ కూడా సాహసం చేయనే లేదు. అధికారికంగా స్వామిగౌడ్‌కు బిజెపి మద్దతిచ్చినప్పటికి లోలోపల టిడిపి, కాంగ్రెస్‌ పార్టీ సైతం మద్దతు ఇవ్వనే ఇచ్చింది. రంగంలో పదహారు మంది పోటీలో నిలిచినప్పటికి స్వామిగౌడ్‌నే విజయం వరించింది. రౌండ్‌రౌండ్‌కు మెజార్టీ పెరుగుతుండడంతో రంగంలో ఉన్న మిగతా అభ్యర్థులు తోక ముడుచుకుని ఇంటి దారి పడుతున్న దృశ్యాలే ఎక్కువగా కనిపించాయి. తెలంగాణా వాదంపైనే పూర్తిగా నమ్మకం పెట్టుకున్న స్వామిగౌడ్‌కు ఈ సారి గతంలో కంటే తొలిప్రాధాన్యతా ఓట్లు అధికంగా రావడం మరో విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణా వాదం గతి తెలిసిపోతుందని గంభీరంగా ప్రకటించిన సీమాంధ్ర నేతల చెంపలు చెల్లుమనిపించేలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రౌండ్‌ రౌండ్‌కు స్వామిగౌడ్‌ మెజార్టీ పెరుగుతూ పోతూనే పోయింది. అధికారిక లెక్కలు ప్రకటించే వరకు ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 51శాతం ఓట్లు దాటడంతో ఆయన గెలుపు ఖాయం కావడంతో స్వామిగౌడ్‌ విూడియాతో మాట్లాడుతూ తనగెలుపు ప్రతిఒక్కతెలంగాణా వాదిదన్నారు. తన గెలుపుకోసం కృషిచేసిన టిఆర్‌ఎస్‌ శ్రేణులకు, ఉద్యోగ సంఘాలకు, టిజెఎసి నేతలకు స్వామిగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనకు టిక్కెటిచ్చి ముందుకు నడిపిన కేసిఆర్‌ను జీవితంలో ఏనాడూ మరచిపోనన్నారు. పార్టీ రహితంగా జరిగిన సహకార ఎన్నికల్లో డబ్బుల సంచులు కుమ్మరించి సీట్లు పొందిన కాంగ్రెస్‌ పార్టీల జండాలపై జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏం సమాధానం చెప్పుతుందని స్వామిగౌడ్‌ ప్రశ్నించారు.
కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సుధాకర్‌రెడ్డి
కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పిఆర్‌టియు నాయకుడు మోహన్‌రెడ్డిని సుధాకర్‌రెడ్డి ఖంగుతినిపించారు. తొలిప్రాధాన్యతా ఓట్లతోనే సుధాకర్‌రెడ్డి విజయం సాధించడం మరో విశేషం. ఇప్పటి వరకు తొలి ప్రాధాన్యతా ఓటుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఎవరూ లేరు. శాసనమండలి పునరుద్దరణ తర్వాత ఈఘనత సుధాకర్‌రెడ్డికే దక్కింది. నాలుగు జిల్లాల్లో కలిపి 18వేల 122 ఓట్లు పోలవగా ఉందులో సుధాకర్‌రెడ్డికే 9వేల 359ఓట్లు సుధాకర్‌రెడ్డికి దక్కాయి. గత ఎన్నికల్లో కౌంటింగ్‌ తెల్లవారే సరికి జరిగి మూడో ప్రాధాన్యతా ఓట్లు లెక్కించాక గాని ఫలితం వెలువడలేదు. అయితే ఈసారి మాత్రం అధికారులకు తొలిప్రాధాన్యతా ఓట్లతోనే సుధాకర్‌రెడ్డి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు పొందడంతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే కూడికలు, తీసివేతల కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. అధికారికంగా మెజార్టీని ప్రకటించి గెలుపొందిన పత్రం ఇచ్చే సరికి మరో రెండు మూడు గంటల సమయం పట్టనుంది. మెజార్టీ ఓట్లు సాధించిన అనంతరం సుధాకర్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ ఈగెలుపు తన గెలుపు కాదని, టీచర్ల గెలునేనన్నారు. తెలంగాణా వాదం లేదని చెప్పుతున్న సీమాంధ్ర ప్రతినిధులకు, సమైక్యవాదంతో పనిచేస్తున్న సంఘాలకు తన గెలుపు చెంప దెబ్బలాంటిదన్నారు. తొలి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించడం, అదీ శాసనమండలిలో రికార్డు కావడం గులాభీ ఖండువ గొప్పతనం వల్లే జరిగిందన్నారు. తన గెలుపుకోసం కృషిచేసిన ప్రతిఒక్క ఉపాధ్యాయుడికి, టిఆర్‌ఎస్‌ శ్రేణులకు ప్రధానంగా పార్టీ అధినేత కేసిఆర్‌కు సుధాకర్‌రెడ్డి దన్యవాదాలు తెలిపారు. కాగా, నల్గొండ,ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూకు చెందిన పూల రవీందర్‌ విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థికి వరదారెడ్డికి గట్టిషాక్‌ తగిలింది. ఇతడిపై 2800 పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.