ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం షురూ…

ఆదిలాబాద్‌్‌, ఫిబ్రవరి 2 (): ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయడంతో కార్యకర్తలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుండి టిఆర్‌ఎస్‌ బలపరుస్తున్న సుధాకర్‌ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వామిగౌడ్‌ విజయం కోసం టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తెలంగాణ వాదులు కృషి చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సమైక్యవాదులకు కనువింపు కలిగించేలా ఉపాధ్యాయులు, పట్టభద్రులు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ నాయకుడిగా స్వామిగౌడ్‌ చేసిన సేవలు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో సుధాకర్‌రెడ్డి చేసిన కృషిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ, సింగరేణిఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని విజయదుంధుభి మోగించినట్లే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలంగాణ వాదాన్ని మరోసారి ప్రతిబింబింపచేయాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ ఎన్నికలు చాలా ప్రధానమని, ఎన్నికల ద్వారా సమైక్య వాదులకు, కేంద్రప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా గుణపాఠం చెప్పాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో సహకార సంఘ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో జిల్లా రాజకీయాలు ఒకేసారి వేడెక్కాయి.