ఎర్రకోటపై జాతీయజెండా రెపరెపలు

mt8dye5f
హైదరాబాద్‌: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు హాజరయ్యారు.

భారత తత్వం ప్రపంచానికి దిక్సూచి: ప్రధాని మోదీ

భిన్నత్వంలో ఏకత్వం అన్న భారత తత్వం ప్రపంచానికి దిక్సూచి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.స్వాతంత్రదినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రాణాలు పణంగా పెట్టి జీవితాన్ని జైలుకు అంకితం చేసిన అమరుల త్యాగ ఫలమిది… 125 కోట్ల మంది భారత ప్రజల నూతన సూర్యోదయం ఇది అని పేర్కొన్నారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు. అభివృద్ధి అన్న కొత్త నినాదంతో వీటన్నింటినీ భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

మన లక్ష్యం టీమిండియా

దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే ప్రధానం… మన లక్ష్యం టీమిండియా అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జనవరి 26 నాటికి ప్రతి ఒక్కరికీ ఖాతాలు తెరవాలని బ్యాంకులను ఆదేశించాం. బ్యాంకు ఖాతాలు తెరవాలని పిలుపునిస్తే పేదలందరూ ముందుకొచ్చారని, వూహించినదానికి భిన్నంగా రూ.వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపారు. ఇది భారత పేదలు సాధించిన విజయంగా అభివర్ణించారు. పేదలందరినీ బ్యాంకు గడపకు తీసుకురావటం కఠినతరమైన అంశం… బ్యాంకు ఉద్యోగుల కఠినశ్రమ, సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు.

స్వచ్ఛభారతాన్ని మహనీయునికి అంకితం చేయాలి

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి, సురక్షా బీమా యోజన కొత్త మార్గాలు తెరిచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బీమా అంటే తెలియని అట్టడుగు వర్గాలకు ధీమా లభించిందన్నారు. భారత అభివృద్ధి పిరమిడ్‌ ఆర్థిక శక్తి మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఎర్రకోటపై మరుగుదొడ్ల గురించి మాట్లాడితే ఈయనేం ప్రధాని అన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ ఉద్యమం వూపందుకుందన్నారు. సెలబ్రిటీలు, నాయకులు… స్వచ్ఛభారత్‌ అంబాసిడర్లు కాదు, మీ ఇంట్లోని 10-15 ఏళ్ల పిల్లలే స్వచ్ఛభారత్‌ అంబాసిడర్లు అని వ్యాఖ్యానించారు. గాంధీజీ 150వ జన్మదినం నాటికి స్వచ్ఛభారతాన్ని ఆ మహనీయునికి అంకితం చేయాలని పిలుపునిచ్చారు.

మా దృష్టి తూర్పు తీరంపైనే

దేశం అభివృద్ధి అంటే ఒక ప్రాంతం అభివృద్ధి కాదు. దేశ పశ్చిమతీరం అభివృద్ధి చెందితే సరిపోదు, మా దృష్టి తూర్పు తీరంపైనేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. బిహార్‌, బంగాల్‌, అసోం, ఒడిశా, ఈశాన్య రాష్గాల అభివృద్ధి తమ లక్ష్యమని వివరించారు. వ్యవసాయశాఖ పేరును వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మారుస్తామని ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి పలు దశాబ్దాలు గడిచినా 18,500 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు. వచ్చే వెయ్యి రోజుల్లో 18,500 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా కల్పిస్తామని తెలిపారు. రాష్గాలు, స్థానిక సంస్థల సహకారంతోనే దీన్ని సాధించగలుగుతామన్నారు. దేశంలో స్టార్టప్‌లు ప్రారంభంకాని జిల్లాలు, బ్లాక్‌లు లేకుండా చూస్తామన్నారు.