ఎలక్టాన్రిక్‌ సిగరెట్లపై నిషేధం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): పొగాకు దిగ్గజ సంస్థ ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌ ఇంక్‌ వంటి కంపెనీలు దేశంలో వాటి ఉత్పత్తులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న వేళ ఎలక్టాన్రిక్‌ సిగరెట్ల అమ్మకం లేదా దిగుమతి నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది. పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు చనిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికీ 106 మిలియన్లుకు పైగా వయస్కులు ధూమపానం చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇటువంటి పరికరాలు తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆరోగ్య శాఖ సూచనలు ఇచ్చింది. ఇటువంటి ఉత్పత్తులను ఉపయోగించి పిల్లలు, ఇతరులు నికోటిన్‌కు బానిస కావచ్చునని సందేహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఫిలిప్‌ సంస్థ పొగాకు ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక వేస్తోంది. అంతకముందు ఆసంస్థ ఈ ఉత్పత్తి హానికరం కాదని వెల్లడిచేసింది. కాగా, నికోటిన్‌తో ఉన్న ఈ ఎలక్టాన్రిక్‌ పరికరం అమ్మడం, కొనుగోలు, దిగుమతి చేయకూడదని రాష్ట్రప్రభుత్వాలను ఆరోగ్య శాఖ కోరింది.