ఎల్లంపల్లితో ముందు జిల్లా భూములు తడవాలి: టిడిపి
ఆదిలాబాద్,ఏప్రిల్7(జనంసాక్షి): ఎల్లంపల్లి జలాశయం నీటిని ముందుగా జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకు అందేలా చూడాలని టిడిపి డిమాండ్ చేసింది. ఇక్కడి భూమికి సాగునీరు అందించిన తరవాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. కాళేశ్వరం సవిూపంలోని మేడిగడ్డ వద్ద నిర్మించే ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లిలో నింపి అక్కడి నుంచి ఇతర జిల్లాలకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చెప్పడాన్ని టిడిపి తూర్పు జిల్లా అధ్యక్షులు బోడ జనార్దన్ వ్యతిరేకించారు. ఎల్లంపల్లి జలాశయం నీటిని జిల్లా వ్యవసాయానికి అందించే వరకు తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో గత ప్రభుత్వాలు నిర్మించిన చిన్నతరహా, మధ్యతరహా జలాశయాలు 80 శాతం పనులు పూర్తయిన తర్వాత నిరుపయోగంగా ఉన్నాయని, వాటి నిర్మాణం ముందుగా పూర్తి చేయాలన్నారు. ఎల్లంపల్లి జలాశయానికి ఎడమకాల్వ నిర్మించి వ్యవసాయానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల మండలం గుడిపేట శివారులోని గోదావరి నదిపై నిర్మించిన తర్వాతే ఇతర జిల్లాలకు తీసుకెళ్లాలని అన్నారు. ముందుగా ప్రతిపాదించిన విధంగా తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత జలాశయం నిర్మించి, ఎల్లంపల్లి జలాశయం ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల డివిజన్‌లోని మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల పురపాలక సంఘాల ప్రజలకు తాగునీరు అందించడానికి ఎల్లంపల్లి
జలాశయంలో 5 టీఏంసీల నీటిని నిల్వ ఉంచాలన్నారు. ఉట్నూరులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌కు తరలించగా ముఖ్య మంత్రితో మాట్లాడుతానని చెప్పిన మంత్రులకు సీఎం దగ్గర వెళ్లేందుకు అనుమతి కూడా లభించని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరపడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగుల బదిలీల నుంచి మొదలుకొని రెండు పడకల ఇళచ?ల మంజూరు వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాలలో తాగునీటి సమస్యతో గిరిజనులు అల్లాడిపోతుంటే పనులు చేయకుండానే నిధులను స్వాహా చేశారని ఆరోపించారు.