ఎవరినీ నమ్మొద్దు..పోరాటం ఆపొద్దు

తెలంగాణ ప్రజలారా.. తస్మాత్‌ జాగ్రత్త ! కొందరు రాజకీయ నాయకులు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మీ దృష్టిని మళ్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ కోసం పోరాడాల్సిన పని లేదన్నట్లు పరోక్షంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం కేంద్రంలో కదలిక వచ్చిందని, ఇక తెలంగాణ ఏర్పాటు త్వరలోనే జరుగనుందని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబేమో తెలంగాణపై త్వరలోనే తమ పార్టీ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తాను ఎప్పటి నుంచో తెలంగాణ విషయాన్ని తేల్చాలని అధిష్టానాన్ని, కేంద్రాన్ని కోరుతున్నానని అంటున్నారు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతమైనా రోడ్డుపై కనిపించని కాంగ్రెస్‌కే చెందిన రేణుకా చౌదరీ కూడా 25 ఏళ్లుగా తాను తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని అందరూ అశ్చర్యపోయేలా ప్రకటించారు. వీళ్లందరూ సరే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అవిర్భవించిన ఏకైక పార్టీ తమదేనని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా త్వరలోనే తెలంగాణ అంటున్నారు. వీళ్లందరి మాటల్లో నిజముందా అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రకటనలు నిన్నా మొన్నటి నుంచి మళ్లీ ఎక్కువయ్యాయి. అదీ తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యాచరణ వెల్లడించాకే ఈ వార్తలు వస్తున్నాయి. ఎందుకు ? మిగతా వాళ్ల వైఖరి అందరికీ తెలిసిందే, కానీ, కేసీఆర్‌ వ్యాఖ్యలే వివాదాస్పదం. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఏర్పాటు కోసమే కృషి చేస్తున్నప్పుడు, టీజేఏసీ కార్యాచరణ వెలువడ్డాక వాళ్లతో కలిసి పని చేయాలి. ప్రత్యక్షంగా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించాలి. ఇంతకు ముందు ఇదే జరిగింది. కానీ, ఇప్పుడే టీఆర్‌ఎస్‌ వైఖరిపై అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ జేఏసీకి తెలియని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ టీఆర్‌ఎస్‌కే ఎలా తెలిసింది. అదీ ఈ రెండు మూడు రోజుల్లోనే ! ఒకవేళ ముందే తెలిస్తే టీజేఏసీకి ఎందుకు తెలుపలేదు ? అలా తెలిపి ఉంటే టీజేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ఉండేది కాదు కదా ! అందుకే కేసీఆర్‌ ప్రకటనపై అనుమానాలు. కేసీఆర్‌ ప్రస్తుత వ్యాఖ్యలపై అనుమానాలుండడానికి కారణాలూ లేకపోలేదు. గతంలోనూ అంటే, 2004లోనూ కాంగ్రెస్‌ను నమ్మిన టీఆర్‌ఎస్‌ అధినేత అప్పటి సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ వస్తుందన్నారు. ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో చేరారు. కానీ, ఆయన మాటలు నిజం కాలేదు. అంతెందుకు ఎన్నోసార్లు వచ్చిన ఉప ఎన్నికల తర్వాత ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్నారు. ఇదీ నిజం కాలేదు. మొన్నటికి మొన్న పరకాల ఉప ఎన్నికే తెలంగాణ ఏర్పాటుకు రెఫరెండం అని ప్రకటించారు. ఈ ప్రకటన కూడా నిరాశపర్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందంటున్నారు. ఆయన మాటలు నిజం కావాలని ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకుంటున్నాడు. కానీ, గతాన్ని చూస్తేనేమో ఆయన ఎన్నోసార్లు చెప్పిన జోస్యం ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఇప్పుడు టీజేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత కేసీఆర్‌ తెలంగాణ ఏర్పాటు సంకేతాలు వస్తున్నాయని సింగరేణి ఎన్నికల విజయోత్సవ సభలో అన్నారు. ఇక్కడ టీజేఏసీని నమ్మాలా ? టీఆర్‌ఎస్‌ను నమ్మాలా ? అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతున్నది. టీజేఏసీకి కేంద్రంలో ఏం జరుగుతున్నదో తెలియకుండానే తన కార్యాచరణను వెల్లడించిందా ? ముమ్మాటికీ కాదు. మళ్లీ ఏదో గూడుపుఠాని జరుగుతున్నట్లు టీజేఏసీ భావించి ఉండొచ్చు. అందుకే, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించి ఉండొచ్చు. ఇక టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే గులాబీ దండు అధినేత చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యం కావు. ఎందుకంటే, ఆయన గత ప్రకటనలే ఇందుకు ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఏదేమైనా టీఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీ. దాని స్వప్రయోజనాలు దానికి ఉంటాయి. దాని సిద్ధాంతాల ప్రకారమే అది తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. కానీ, టీజేఏసీ రాజకీయ పార్టీ కాదు. దానికి స్వప్రయోజనాలు అంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు తర్వాత దాని పునర్నిర్మాణం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలను నమ్మి చాలాసార్లు మోసపోయారు. ఇకపై ఏమాత్రం అలా జరుగకూడదు. కచ్చితంగా తెలంగాణవాదులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు, ప్రజలు, మేధావులు, ఆయా సంఘాలు తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యాచరణను తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ప్రత్యేక రాష్ట్రం వచ్చేదాకా ఉద్యమించాలి. వచ్చాక పునర్నిర్మాణం కోసం పోరాడాలి. కాబట్టి, ఇక్కడ చెప్పేదొక్కటే. ఎవరినీ నమ్మొద్దు.. పోరాటం ఆపొద్దు.