ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.1.412 కోట్ల రుణం
ఖమ్మం, జూలై 12 : షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం ద్వారా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 1.412 కోట్ల రూపాయలు రాయితీతో కూడిన రుణం అందజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు రాందాస్ తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎస్సీ కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు సహకార సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 10 నుంచి 24 వరకు జిల్లావ్యాప్తంగా మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపి చేస్తున్నామన్నారు. వీరికి కార్పొరేషన్ ద్వారా 5.50 కోట్ల రూపాయల ప్రభుత్వ రాయితీ లభిస్తుందన్నారు. సహకార సంఘం ద్వారా కావాల్సిన వారు అర్హత ఉన్న 167 పథకాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. షెడ్యూల్డ్ సహకార సంఘాల ద్వారా గరిష్ఠంగా ఐదు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. జిల్లాలోని నాగులవంచలో ఎస్టీలకు అందజేసిన 80 ఎకరాల భూమికి అర్హతలను పరిశీలించి త్వరలో సాగునీటి సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామని అన్నారు.